ఆదిలాబాద్,అర్జున్ సమాచారం:
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో నాలుగు వెంటిలేటర్లను చోరీ చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన సజ్జన్, అభిజిత్ అనే ఇద్దరు వ్యక్తులు టెక్నీషియన్లమంటూ రిమ్స్‌లోకి ప్రవేశించి వెంటిలేటర్లను అపహరించినట్లు తెలిపారు.
గత నెల 30న రిమ్స్ ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉన్న ఆర్‌ఐసీయూ, చెస్ట్ వార్డుల నుంచి ఒక్కో వెంటిలేటర్, టీబీ వార్డు నుంచి మరో రెండు వెంటిలేటర్లు చోరీకి గురయ్యాయి. మొత్తం నాలుగు పరికరాలు మాయమైనట్లు ఆస్పత్రి అధికారులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు వెంటిలేటర్లను సంచుల్లో పెట్టుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో రిమ్స్ డైరెక్టర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితులను పట్టుకున్నారు.
హైదరాబాద్ వ్యాపారికి విక్రయం: వెంటిలేటర్లను చోరీ చేసిన సజ్జన్, అభిజిత్ వాటిని హైదరాబాద్‌కు చెందిన కొండారెడ్డి అనే వైద్య పరికరాల వ్యాపారికి విక్రయించినట్లు ఎస్పీ వెల్లడించారు. చోరీ చేసిన పరికరాలను కొండారెడ్డి చంద్రపూర్‌లో కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా ఆదిలాబాద్ పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి నాలుగు వెంటిలేటర్లతో పాటు కారు, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
==================