భద్రాద్రి కొత్తగూడెం,అర్జున్ సమాచారం:
అన్ని దానాల్లో విద్యాదానం మహోన్నతమైనది” అనే లక్ష్యంతో దానధర్మ ట్రస్ట్ చైర్మన్ ఘంటా రాధా ఆదివాసి గ్రామాల్లో విద్యా సేవలను విస్తరిస్తున్నారు. అశ్వాపురం మండలంలోని మావిళ్లవాయి–గుట్టబోరు ఆదివాసి గ్రామంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలను నిర్మించి ప్రారంభించారు.
నిరక్షరాస్యత అధికంగా ఉన్న వలస ఆదివాసి గ్రామాల చిన్నారులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో ఉపాధ్యాయులను నియమించి ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు. అలాగే విద్యార్థులకు ప్రతిరోజూ ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తూ వారి పోషకాహార అవసరాలను కూడా తీర్చుతున్నారు.
మౌలిక సదుపాయాలు లేని గ్రామాల్లో పాఠశాల భవనాల నిర్మాణంతో పాటు విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, నోట్‌బుక్స్, ఇతర విద్యా సామగ్రిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ ఒకే చోట విద్యాబోధన అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
దాతల సహకారంతో దానధర్మ ట్రస్ట్ ఈ పాఠశాలలను నిర్వహిస్తూ, ఆదివాసి పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది. ఈ సేవా కార్యక్రమాలను పలువురు ప్రముఖులు అభినందిస్తూ, ఘంటా రాధా చేస్తున్న సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు.
ఈ సందర్భంగా దానధర్మ ట్రస్ట్ చైర్మన్ ఘంటా రాధా మాట్లాడుతూ, “పేద ప్రజలకు, ముఖ్యంగా ఆదివాసి పిల్లలకు సేవ చేయడం దేవుడు నాకు ప్రసాదించిన వరంగా భావిస్తున్నాను. ఈ సేవా కార్యక్రమాలకు అండగా నిలిచిన దాతలకు, పెద్దలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.
====================