ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 5:20 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఎలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తనివ్వం- మంత్రి సీతక్క

అర్జున్ సమాచారం :
వర్షాలు ఆలస్యమైనా.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ముందస్తు కార్యాచరణతో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా
జలాశయాల నీటి నిల్వలపై రోజువారీ పర్యవేక్షణ.. అవసరమైతే ప్రత్యామ్నాయ నీటి వనరుల వినియోగానికి ఆదేశాలు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క అధ్యక్షతన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ బోర్డు సమావేశం తెలంగాణ సచివాలయంలో జరిగింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి సరఫరా పరిస్థితి, జలాశయాల్లో నీటి నిల్వలు, రాబోయే నెలల్లో తాగునీటి అవసరాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. వర్షాలు ఆలస్యమైనా, వర్షపాతం తగ్గినా, ఎల్‌నినో ప్రభావం ఉన్నా రాష్ట్రంలో ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు పనిచేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని గ్రామీణ జనావాసాలకు ప్రధానంగా కృష్ణా, గోదావరి బేసిన్‌ల ఉపరితల జల వనరుల నుంచి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు సమావేశంలో వివరించారు. తాగునీటి కోసం వినియోగిస్తున్న 29 జలాశయాల నుంచి 123 నీటి శుద్ధి కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు నీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో, ప్రతి జలాశయంలో 45 రోజులు, 90 రోజులు, 180 రోజుల అవసరాలకు అనుగుణంగా నీటి లభ్యతపై మంత్రి సమీక్షించారు.
అన్ని జలాశయాల్లో నీటి మట్టాలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. తాగునీటి అవసరాలకు సరిపడా నీటి నిల్వలను ప్రతి జలాశయంలో ముందుగానే నిర్ధారించాలని సూచించారు.
జూలై నెలాఖరు వరకు తగిన నీటి ప్రవాహం లేకపోతే అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఉదయసముద్రానికి, తుపాకులగూడెం బ్యారేజ్ నుంచి దుమ్ముగూడెంకు నీటిని విడుదల చేసేలా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
ప్రస్తుతం సింగూర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో, రాబోయే 45 రోజుల్లో సింగూర్‌లోకి తగిన నీటి ప్రవాహం రాకపోతే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి (పాక్షికంగా), నిజామాబాద్ (పాక్షికంగా) జిల్లాల్లోని గ్రామీణ జనావాసాలు, పట్టణ ఆధారిత నివాస ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి, ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాల ఆధారిత తాగునీటి పథకాలను వినియోగించేలా తక్షణమే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే రాష్ట్రంలోని అన్ని నివాస ప్రాంతాలకు స్థానిక మంచి నీటి వనరులను వినియోగిస్తూ ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని సూచించారు. స్థానిక నీటి వనరులు అందుబాటులో లేని ప్రాంతాల్లో బోర్‌వెల్‌లను లోతుగా తవ్వడం, ఫ్లషింగ్ చేయడం, అవసరమైతే బోర్‌వెల్‌లను అద్దెకు తీసుకోవడం వంటి చర్యలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఎల్‌నినో ప్రభావం లేదా ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా ఎలాంటి తాగునీటి సంక్షోభం తలెత్తకుండా ప్రభుత్వం పూర్తిస్థాయి అప్రమత్తతతో పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి నివాస ప్రాంతానికి నిరంతరాయంగా సురక్షితమైన తాగునీరు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు చర్యలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ కృపాకర్ రెడ్డి, ఇతర చీఫ్ ఇంజనీర్లు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు
=============================