హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ఎల్నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందన్న ముందస్తు అంచనాలతో గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వం అప్రమత్తమైంది.
భూగర్భ జలాలను అడ్డగోలుగా తోడేస్తూ, ప్రజల నీటి అవసరాలను వ్యాపారంగా మార్చుకుని లక్షల రూపాయలు ఆర్జిస్తున్న ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.
అక్రమ బోర్లు, అనుమతులు లేని నీటి వ్యాపారానికి చెక్ పెట్టేందుకు హెచ్ఎండబ్ల్యూఎస్, హైడ్రా, హెచ్ఎండీఏ, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు రంగంలోకి దిగారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొందరు ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు ఎలాంటి నియంత్రణ లేకుండా బోర్లు తవ్వుతూ భూగర్భ జలాలను యథేచ్ఛగా తోడేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాత్రింబవళ్లు నీటిని పెద్ద పెద్ద ట్యాంకర్లలో నింపి, ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారని అధికారులు గుర్తించారు.
రాబోయే వేసవి పరిస్థితులు, ఎల్నినో ప్రభావంతో ఏర్పడే నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని భూగర్భ జలాల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
వాల్టా చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా నీటిని తోడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి నిబంధనలను కఠినతరం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
భారీగా నీటిని తరలించే ట్యాంకర్లకు ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతుల విషయంలో ఆంక్షలు విధిస్తూ, సంబంధిత జలమండలి, హెచ్ఎండబ్ల్యూఎస్, హైడ్రా, ఔటర్ రింగ్ రోడ్డు అధికారులకు నోటీసులు జారీ చేశారు.
అయితే ప్రభుత్వ నిర్ణయంతో తమ వ్యాపారాలకు భారీగా నష్టం వాటిల్లుతుందని భావిస్తున్న కొందరు ట్యాంకర్ల యజమానులు అధికారుల చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ‘మా దగ్గర డబ్బులు ఉన్నాయి.. నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు.. మీకెందుకు అభ్యంతరం?’ అంటూ అధికారుల తీరుపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
మరోవైపు ప్రజల తాగునీటి అవసరాలు, భూగర్భ జలాల పరిరక్షణే ప్రభుత్వ ప్రాధాన్యత అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అక్రమ నీటి వ్యాపారానికి అడ్డుకట్ట వేసి, భవిష్యత్తు తరాలకు నీటి వనరులను కాపాడటమే లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.