ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 7:12 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఓల్డ్ సిటీలో మెట్రో అడుగులు… 833 స్థలాల స్వాధీనం

హైదరాబాద్, ఆగస్టు 31,అర్జున్ సమాచారం:
హైదరాబాద్‌ పాతనగరం మెట్రో విస్తరణ పనులను వేగవంతం చేయాలని HMRL, HAML అదనపు ఎండీ బి.అజిత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దారుషిఫా నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. మొత్తం 888 ప్రభావిత ఆస్తుల్లో 833 ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 55 ఆస్తుల్లో ఉన్న వారసత్వ, పురాతన భవనాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యుత్‌, నీటి పైపులు తదితర యుటిలిటీల తరలింపును, ఆస్తుల తొలగింపును వేగవంతం చేసి త్వరగా ఆర్వోడబ్ల్యూ అందుబాటులోకి తేవాలని సూచించారు.హైదరాబాద్‌ పాతనగరం మెట్రో రైలు విస్తరణ పనులనుమరింత వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. మెట్రో కారిడార్‌ నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భూసేకరణ, ఆస్తుల తొలగింపు, యుటిలిటీల తరలింపు పనులను త్వరగా పూర్తి చేయాలని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ ( HMRL ), హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ ( HAML ) అదనపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.అజిత్‌రెడ్డి ఆదేశించారు. ఇవాళ ఆయన ఓల్డ్‌సిటీలో దారుషిఫా నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెట్రో రైల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ ఎస్‌.భాస్కర్‌రెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కారిడార్‌ అభివృద్ధికి మొత్తం 888 ప్రభావిత ఆస్తులను గుర్తించగా.. ఇప్పటివరకు 833 ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. మిగిలిన 55 ఆస్తులకు సంబంధించి వారసత్వ కట్టడాలు, పురాతన భవనాలు ఉండటంతో వాటి విషయంలో తీసుకుంటున్న చర్యలపై అజిత్‌రెడ్డి సమీక్షించారు. చారిత్రక నిర్మాణాలకు ఇబ్బంది కలగకుండా, మెట్రో పనులకు అవసరమైన మార్గాన్ని సిద్ధం చేసేందుకు ప్రత్యామ్నాయ చర్యలను పరిశీలించాలని సూచించారు. మెట్రో కారిడార్‌లో విద్యుత్‌ తీగలు, స్తంభాలు, వాటర్‌ వర్క్స్‌ పైప్‌లైన్లు తదితర యుటిలిటీలు పనులకు అడ్డంకిగా మారకుండా వాటిని సురక్షితంగా తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు ఎండీ ఆదేశించారు. భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో ప్రభావిత ఆస్తుల తొలగింపును కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు.పాతనగరం మెట్రో పనులను వేగంగా పూర్తిచేసి స్థానిక ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యం అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని అజిత్‌రెడ్డి పేర్కొన్నారు. మెట్రో పనులకు స్థానిక ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని, వారు తమవంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు. కారిడార్‌కు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి త్వరితగతిన రైట్‌ ఆఫ్‌ వే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. భూసేకరణలో ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు కృషి చేసిన రెవెన్యూ అధికారులను ఆయన అభినందించారు. త్వరలోనే మిగిలిన భూసేకరణ పూర్తి చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అన్నారు
==============================