ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 8:19 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కరీంనగర్ కీర్తిని అంతర్జాతీయ వేదికపై చాటనున్న అక్షిత జాతీయ స్థాయిలో స్వర్ణం. ఏషియన్ పోటీలకు భారత జట్టులో స్థానం కరీంనగర్,

కరీంనగర్,అర్జున్ సమాచారం:
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, చింతకుంట జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆకుల అక్షిత భారతదేశం తరఫున ఏషియన్ త్రోబాల్ పోటీలకు ఎంపికై అరుదైన ఘనత సాధించింది.
గత నెలలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో నిర్వహించిన జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్న ఆకుల అక్షిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జట్టుకు బంగారు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. జాతీయ స్థాయిలో ఆమె చూపిన అత్యుత్తమ ప్రదర్శనను గుర్తించిన ఎంపిక కమిటీ అక్షితను భారత జట్టుకు ఎంపిక చేసింది.
శ్రీలంకలోని నిగాంబో ఇండోర్ స్టేడియంలో నవంబర్ 19 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న ఏషియన్ త్రోబాల్ ఛాంపియన్‌షిప్‌లో ఆకుల అక్షిత భారతదేశం తరఫున పాల్గొననుంది. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో చింతకుంట గురుకుల పాఠశాల, కళాశాలలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
ఆకుల అక్షిత సాధించిన ఈ ఘనత పట్ల కళాశాల ప్రిన్సిపాల్ ఎ. లక్ష్మీ మేడం, జోనల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, పీడీ సుష్మా మేడం, పీఈటీ సుజాత మేడం, కోచ్ సతీష్తో పాటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందడం ఎంతో గర్వకారణమని తెలిపారు. శ్రీలంకలో జరిగే ఏషియన్ పోటీల్లో కూడా ఆకుల అక్షిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి భారతదేశానికి పతకం తీసుకురావాలని ఆకాంక్షించారు.
చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న ఆకుల అక్షిత చింతకుంట ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
=======================