ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 9:22 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కామన్ వెల్త్ లో భారత్ శుభారంభం

న్యూఢిల్లీ, జూలై 23,అర్జున్ సమాచారం:
స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా 23వ కామన్వెల్త్ క్రీడలు ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే భారత్ తన పతకాల ఖాతా తెరిచింది. ఒలింపిక్ పతక విజేత, స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ బరిలోకి దిగకుండానే దేశానికి తొలి పతకాన్ని ఖాయం చేసింది. మహిళల 75 కేజీల మిడిల్‌వెయిట్ విభాగంలో పోటీ పడుతున్న ఆమె, నేరుగా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించడంతో ఈ అరుదైన ఘనత సాధ్యమైంది.లవ్లీనా పోటీ పడుతున్న 75 కేజీల బాక్సింగ్ విభాగంలో కేవలం ఐదుగురు అథ్లెట్లు మాత్రమే బరిలో ఉన్నారు. డ్రాలో తక్కువ మంది ఉండటంతో లవ్లీనాతో సహా ముగ్గురు బాక్సర్లకు నేరుగా సెమీ ఫైనల్‌కు ‘బై’ లభించింది. మిగిలిన ఇద్దరు క్వార్టర్ ఫైనల్‌లో తలపడనున్నారు. కామన్వెల్త్ క్రీడల నిబంధనల ప్రకారం.. సెమీ ఫైనల్‌లో ఓడిపోయిన ఇద్దరు బాక్సర్లకు కాంస్య పతకాలు లభిస్తాయి. ఈ లెక్కన, లవ్లీనా తన తొలి బౌట్‌లో బరిలోకి దిగకముందే కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.కాంస్య పతకం ఖరారైనప్పటికీ లవ్లీనా ప్రస్థానం ఇప్పుడే మొదలైంది. ఈ నెల‌ 31న జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె టాఫాకితో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్‌కు చేరి, స్వర్ణ పతకం కోసం పోటీపడుతుంది. దాంతో కనీసం రజతం ఖాయమవుతుంది. ఒకవేళ సెమీస్‌లో ఓడినా, ఆమె కాంస్య పతకంతో స్వదేశానికి తిరిగి వస్తుంది. ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 124 మంది సభ్యులతో కూడిన బలమైన బృందంతో పాల్గొంటోంది. నేడు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుండగా, అంతకుముందే రెండు లాన్ బౌల్స్ మ్యాచ్‌లతో భారత క్రీడాకారులు తమ ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. లవ్లీనా రూపంలో తొలి పతకం ఖరారు కావడం భారత శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
==============