ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 8:28 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కాశ్మీర్ పేరు ఎత్తగానే పాక్‌ ప్రధానికి గట్టిగా బుద్ధిచెప్పిన భారత్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26,అర్జున్ సమాచారం:
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 81వ సమావేశంలో జమ్మూ కాశ్మీర్‌పై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనపై భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. అలాగే జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ అంశంపై ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ అవలంబిస్తున్న తీవ్రవాదం, మోసాలు, ద్వంద్వ వైఖరి వల్ల ఆ దేశానికి గానీ, లేదా ప్రపంచానికి గానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని భారత దౌత్యవేత్త పెటల్ గెహ్లాట్ స్పష్టం చేశారు.ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ పెటల్ గెహ్లాట్ మాట్లాడుతూ.. “ఐరాస జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రతినిధి కొన్ని విచిత్రమైన మాటలు మాట్లాడారు. న్యూయార్క్ సిటీ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఉగ్రదాడిని ఎదుర్కొని 25 ఏళ్లు పూర్తి చేసుకున్న 2 వారాల తర్వాత ఈ సంఘటన జరిగిందని” అన్నారు’ఈ సందర్భాన్ని అందరూ గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సెప్టెంబర్ 9/11 మాస్టర్‌మైండ్ ఒసామా బిన్ లాడెన్, పాకిస్తాన్ మిలిటరీ అకాడమీకి పక్కనే నివసిస్తుండేవాడు. నేడు పాకిస్తాన్ ప్రతినిధి ఏ సంస్థ పట్లనైతే ఇంతటి గౌరవాన్ని ప్రదర్శించారో అదే ఆ సంస్థ ఇది. అయితే పాకిస్తాన్ ప్రజలు స్వయంగా ‘ఫార్మ్ 47 ప్రభుత్వం’ అని పిలుచుకునే ప్రభుత్వం నుంచి ఇలాంటి చెత్త మాటలు మాత్రమే ఆశించవచ్చు’ అని వ్యాఖ్యానించారు.ఫార్మ్ 47 ప్రభుత్వం అనేది ఒక పొలిటికల్ టర్మ్. రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూటమి కోసం ఈ పదాన్ని ఉపయోగిస్తుంటాయి. అక్కడి ప్రతిపక్ష పార్టీలు, ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన PTI పార్టీ, ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాయి. భారత అధికారిణి పెటల్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం తమ సొంత రాజధాని ఇస్లామాబాద్‌లోనే ప్రజలకు వ్యతిరేకంగా బలాన్ని ప్రదర్శిస్తున్న పాలకుల వద్ద నుంచి ప్రజాస్వామ్య హక్కులు,  మానవతా విలువలపై మనం గొప్ప స్పీచ్ విన్నాం. ఇది ఆర్మీ ద్వారా, ఆర్మీ కోసమే జరుగుతున్న పాలన. ఆ దేశం నుంచి కీలుబొమ్మలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారనే విషయంలో మనం ఎలాంటి భ్రమల్లో ఉండొద్దని’ అన్నారు.
జమ్మూ కాశ్మీర్ మొత్తం భారత్‌లో అంతర్భాగం : పెటల్ గెహ్లాట్
పాకిస్తాన్ అసలు స్వరూపం దాని 27వ సవరణలో ఉంది. మనం విన్న ఆలోచనలు మతమౌఢ్యం, ద్వేషం వారికి ఉన్న రికార్డు. పాక్ పగటిపూట భద్రత గురించి మాట్లాడి, రాత్రి వేళల్లో ఉగ్రవాదానికి పాల్పడుతుందని ఆమె ఎద్దేవా చేశారు.  మతపరమైన అసహనం గురించి పాక్ మాట్లాడితే ప్రపంచ దేశాలు నవ్వుతున్నాయి. పాకిస్తాన్‌లో మైనారిటీల పట్ల ఎలాంటి వైఖరి ఉంటుందో ప్రపంచానికి తెలుసని, ఈ విషయంలో మిగతా దేశాలను పాక్ దారి పట్టించడం కష్టమన్నారు. ఇక్కడ, భారత్ తరఫున జమ్మూ కాశ్మీర్ ప్రస్తావనపై స్పందిస్తూ— ‘జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అని, మా నుంచి విడదీయరాని భాగం. అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. కానీ కాశ్మీర్‌పై చర్చించాల్సి వస్తే, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK)పై ఫోకస్ చేయాలి. సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న నిర్బంధ హత్యలు, క్రూరమైన హింస, ప్రాథమిక హక్కులను కాలరాయడం గురించి అక్కడి రావల్‌కోట్ ప్రజలను అడిగి తెలుసుకోండి’ అన్నారు.
షెహబాజ్ షరీఫ్ ఏమన్నారంటే..
ఏడాది కిందట భారత్ మా పాకిస్తాన్ పై దాడి చేసిందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆర్టికల్ 51 కింద పాకిస్తాన్ తన ఆత్మరక్షణ హక్కును ఉపయోగించుకుందని పేర్కొన్నారు. ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, ఆర్మీ అత్యంత ఖచ్చితత్వంతో బదులిచ్చాయన్నారు.’మాపై దాడికి వచ్చిన శత్రువు నోరు పాకిస్తాన్ మూయించింది. పొరుగుదేశం ఎప్పటికీ మరచిపోలేని పాఠాన్ని పాక్ నేర్పింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూరదృష్టి కలిగిన నాయకత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నాను. దక్షిణాసియాలో కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడారు. అణ్వాయుధాలు కలిగిన రెండు పొరుగు దేశాలు యుద్ధ అంచున నిలిచిన క్లిష్ట సమయంలో అమెరికా సరైన సమయంలో జోక్యం చేసుకుంది. ట్రంప్ ఆ కీలక సమయంలో చర్యలు తీసుకోకపోతే ఎంతటి వినాశనం జరిగేదో. అదే విధంగా కాశ్మీర్ వివాదానికి న్యాయమైన,  నిష్పాక్షికంగా పరిష్కారం కావాలని’ షరీఫ్ అన్నారు.

==================