ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 8:19 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గాంధీ జయంతి నుంచి ఆందోళన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25,అర్జున్ సమాచారం:
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. శనివారం లోగా ఆయన రాజీనామా చేయకపోతే గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త నిరసనలు చేపడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. జ్ఞానేశ్ కుమార్ తప్పుకోకపోతే తమ ఆందోళనను దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరింపజేస్తామని స్పష్టం చేశారు.భిజీత్ దీప్కే ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్ చేశారు. “రేపటిలోగా జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకపోతే, సీజేపీ తన దేశవ్యాప్త నిరసనను అక్టోబర్ 2న ముంబైలో ప్రారంభించి, భారతదేశంలోని ఇతర నగరాలకు కూడా తీసుకువెళుతుంది. ఈ గాంధీ జయంతి నాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రతిజ్ఞ చేద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు.అంతకుముందు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో దీప్కే మాట్లాడుతూ.. జ్ఞానేశ్ కుమార్‌ను ఈ దేశానికి అతిపెద్ద ద్రోహిగా, దేశ వ్యతిరేకిగా అభివర్ణించారు. “ఎన్నికల సంఘంపై వచ్చిన ఒక నివేదిక ప్రకారం జ్ఞానేశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. మన దేశంలో ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యం. కానీ, జ్ఞానేశ్ కుమార్ సీఈసీ అయినప్పటి నుంచి, ఎవరు ఓటు వేయాలో, ఎవరు వేయకూడదో ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. ఇది ప్రజాస్వామ్యం కాదు, నిరంకుశత్వం. దీనికి ప్రధాన కారకుడు జ్ఞానేశ్ కుమార్” అని దీప్కే తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన 48 గంటల్లో పదవి నుంచి దిగిపోవాలని అల్టిమేటం జారీ చేశారు.ఎస్ఐఆర్‌, ఓటర్ డేటా యాక్సెస్, కొత్త ఓటర్ల నమోదు వంటి కీలక అంశాలపై ఎన్నికల సంఘంలోనే విభేదాలు తలెత్తాయని వస్తున్న వార్తల నేపథ్యంలో సీజేపీ ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదే సమావేశంలో పార్టీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. ప్రస్తుత వ్యవస్థ దేశాన్ని ఒక పెద్ద ప్రహసనంగా మార్చేసిందని విమర్శించారు. “ఈ వ్యవస్థ అవినీతిమయమైంది, విఫలమైంది. దేశంలోని యువత మార్పును కోరుకుంటోంది. ప్రాథమిక మార్పులు అవసరమని వారు డిమాండ్ చేస్తున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు
================