ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 6:42 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

చర్చలు విఫలం… ఐదు రోజులు బ్యాంకులు బంద్! సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మె

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం:
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడనుంది. బ్యాంకు యూనియన్లు, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఫలితంగా సెప్టెంబర్ చివరి వారంలో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
వారానికి ఐదు రోజుల పనిదినాలు, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంకు సంఘాలు కొంతకాలంగా నిరసనలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక శాఖ సూచన మేరకు మంగళవారం డిప్యూటీ లేబర్ కమిషనర్తో జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదు. ఐదు రోజుల పని విధానం అంశం పరిశీలనలో ఉందని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, స్పష్టమైన హామీ లభించకపోవడంతో యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు సమ్మె చేపట్టాలని నిర్ణయించాయి. సమ్మెకు ముందు సెప్టెంబర్ 26, 27 తేదీల్లో శని, ఆదివారాలు కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవులు ఉన్నాయి. దీంతో మొత్తం ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇదే డిమాండ్లతో ఈ నెల 11న కూడా బ్యాంకు సంఘాలు సమ్మె నిర్వహించిన విషయం విదితమే. ఈ పరిణామాల దృష్ట్యా, వినియోగదారులు తమ ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు
===============