తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కొందరు రఘు మాస్టర్ ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం చెల్లదు అని, తాము ఆ కార్యవర్గాన్ని గుర్తించడం లేదని సుమలత అన్నారు. తమకు ఎలాంటి అధికారిక న్యాయపరమైన నోటీసు ఇవ్వకుండా మరో వర్గం కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం చట్టబద్ధం కాదన్నారు.
రఘు మాస్టర్ వర్గం ప్రకటించిన కొత్త కార్యవర్గంపై సుమలత దేవి తీవ్రస్థాయిలో స్పందించారు. తమను, తమ సభ్యులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
“కొంతమంది పెద్దలే మా యూనియన్ను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఒక వర్గం ఏర్పాటు చేసుకున్న కార్యవర్గం అధికారికం కాదు. దానికి మా అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేదు. అందులో గతంలో తప్పులు చేసినవారే ఉన్నారు. మా కార్యవర్గానికి ఎలాంటి లీగల్ నోటీసు రాలేదు. నోటీసు ఇవ్వకుండా మా కార్యవర్గాన్ని నాన్-ఆఫీషియల్ అని ఎలా ప్రకటిస్తారు?” అని సుమలత ప్రశ్నించారు.
అసోసియేషన్‌లో గతంలో జరిగినట్లు చెబుతున్న రూ.36 లక్షల అవినీతి వ్యవహారానికి సంబంధించిన తుది నివేదికను ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించినందుకే ప్రస్తుతం ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.
“మా యూనియన్ సమస్యపై నిర్ణయం తీసుకునే అధికారం మా సభ్యులకే ఉంది. మేము నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తున్నాం. యూనియన్‌లో సభ్యులు ఓటు వేయకుండా అడ్డుకునే పరిస్థితులను కొందరు సృష్టిస్తున్నారు. మాకు ఫెడరేషన్ మద్దతు కావాలి. మా కార్యవర్గం ఏ తప్పు చేసిందో స్పష్టంగా చెప్పాలి. మేము ఫెడరేషన్తోనే ఉంటాం. ఫిల్మ్ ఛాంబర్ కూడా మాకు మద్దతుగా ఉడాలి ” అని ఆమె పేర్కొన్నారు.
తమ సమస్యను ఫిల్మ్ ఛాంబర్, మెగాస్టార్ చిరంజీవి గారు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, అశోక్ గారు, రాందాస్ గారు.. వంటి సినీ పెద్దలు పరిష్కరించాలని సుమలత విజ్ఞప్తి చేశారు. తమ యూనియన్ కు మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
“చిరంజీవి గారంటే మాకు ఎంతో ఇష్టం. డ్యాన్స్ అంటే ముందుగా మాకు ఆయనే గుర్తొస్తారు. ఆయన మా సమస్యను పరిష్కరించాలి. తప్పులు చేసిన మా సభ్యుల్లో కొందరిని నిలదీసి ప్రశ్నించినందుకే ఈ స్థాయిలో వివాదం చేస్తున్నారు” అని అన్నారు.
అయితే, యూనియన్ను చీల్చేందుకు లేదా సభ్యులను ఇబ్బంది పెట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే సహించేది లేదంటూ సుమలత తీవ్ర హెచ్చరిక చేశారు.
“మా యూనియన్ను విడదీయాలని చూసేవారికి ఇదే మా హెచ్చరిక. యూనియన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని సభ్యులను, యూనియన్ కార్యకలాపాలను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఎవరైనా హద్దులు దాటితే వారికి గట్టిగా బుద్ధి చెబుతాం. మా యూనియన్ ఐక్యతను దెబ్బతీసే చర్యలను ఎంతమాత్రం సహించేది లేదు” అని సుమలత హెచ్చరించారు.
‘చాలా కాలం సంయమనం పాటించాం’ – జి. బాలకృష్ణ
అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి. బాలకృష్ణ మాట్లాడుతూ.. చాలా కాలంగా తాము సంయమనం పాటిస్తున్నామని, ఇప్పుడు తమపై జరుగుతున్న పరిణామాలపై మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
“చాలా రోజులుగా మేము సంయమనం పాటించాం. ఫెడరేషన్ పెద్దల నుంచి మా సమస్యల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మా జనరల్ బాడీ సమావేశంలో సభ్యులంతా కలిసి తీసుకున్న తీర్మానాలు చెల్లవని చెబుతున్నారు. అప్పుడు మాకు ఒక ప్రశ్న వచ్చింది. మీకు ఒక రూల్.. మాకు ఒక రూల్నా?” అని ఆయన ప్రశ్నించారు.
తమ అసోసియేషన్‌లో తప్పు చేసిన వారిని ప్రశ్నించినందుకే వివాదం సృష్టిస్తున్నారని బాలకృష్ణ ఆరోపించారు.
“మా అసోసియేషన్‌కు ఒక నియమావళి ఉంది. దాని ప్రకారమే మేము ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం ద్వారా ఎన్నికలు నిర్వహించాం. ఫెడరేషన్ నుంచి వల్లభనేని అనిల్ గారు చెప్పే నిబంధనలు మా విషయంలో ఎంతవరకు వర్తిస్తాయో స్పష్టం చేయాలి. అనిల్ గారు.. మేము సంఘ విద్రోహ శక్తులమా? మమ్మల్ని ఎందుకు విడదీస్తున్నారు? రాజకీయాలు చేయకుండా మమ్మల్ని కలపండి” అని ఆయన విజ్ఞప్తి చేశారు.
“మేము తప్పు చేయకపోయినా.. ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమాపణ కోరుతున్నాం. మా ఉద్దేశం యూనియన్ను బలహీనపరచడం కాదు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడమే. మాకు కొంత సమయం ఇవ్వండి. మా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఇవ్వండి” అని బాలకృష్ణ కోరారు.
‘చిరంజీవి, రామ్‌చరణ్ మాకు దేవుళ్లతో సమానం’
మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తమ అసోసియేషన్‌కు గతంలో చేసిన సహాయాన్ని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.
“చిరంజీవి గారు, రామ్‌చరణ్ గారు మాకు దేవుళ్లతో సమానం. మా అసోసియేషన్‌కు వారు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు. వారి సహాయాన్ని మేము జీవితాంతం మర్చిపోలేం. మేము మీకు వ్యతిరేకం కాదు. మీపై మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. మా సమస్యకు మీరే పరిష్కారం చూపాలి. చిరంజీవి గారు.. మాకు కొంత సమయం ఇవ్వండి. మీరే న్యాయం చేయాలి. మమ్మల్ని విడదీయకుండా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలి” అని ఆయన విజ్ఞప్తి చేశారు.
*‘జనరల్ బాడీ నిర్ణయమే కీలకం’ – అడ్వకేట్ బాల*
ఈ సందర్భంగా అడ్వకేట్ బాల మాట్లాడుతూ.. అసోసియేషన్ వ్యవహారాల్లో న్యాయపరమైన అంశాలను వివరించారు.“లీగల్‌గా సుమలత నేతృత్వంలోని కార్యవర్గమే కొనసాగాలి. సాధారణంగా ఒక అసోసియేషన్‌లో జనరల్ బాడీ తీసుకునే నిర్ణయమే అత్యంత కీలకం. పలు సందర్భాల్లో కోర్టులు కూడా జనరల్ బాడీ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇచ్చాయి” అని తెలిపారు.
అసోసియేషన్ బైలా ప్రకారం యూనియన్‌లో సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించేందుకు ఫెడరేషన్ లేదా సంబంధిత పెద్దలు మధ్యవర్తిత్వం చేయవచ్చని.. అయితే తమంతట తాము కొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేసే అధికారం వారికి లేదని ఆయన పేర్కొన్నారు.
“బైలా ప్రకారం సమస్య తలెత్తినప్పుడు పెద్దలు ఇరువర్గాలను కూర్చోబెట్టి పరిష్కరించాలి. అంతే తప్ప కొత్తగా కార్యవర్గాలను ఏర్పాటు చేసే అధికారం వేరే వాళ్లకు లేదు. ఎన్ని కొత్త కార్యవర్గాలు ఏర్పాటు చేసుకున్నా అవి చట్టపరంగా చెల్లుబాటు కావు” అని అడ్వకేట్ బాల స్పష్టం చేశారు.
===========================