ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:30 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

చేనేత కార్మికుల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం రైతన్నకు, నేతన్నకు ఇద్దరికీ అండగా నిలిచే ప్రభుత్వం మాది: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి 100కు పైగా చేనేత స్టాల్స్ ప్రారంభించి పరిశీలన – కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలకు సత్కారం ఆగస్టు 7 నుంచి 16 వరకు కొనసాగనున్న చేనేత వస్త్ర ప్రదర్శన

అర్జున్ సమాచారం:                                                                                                        దేశానికి అన్నం అందించే రైతన్నకు, వస్త్రం అందించే నేతన్నకు ఒకేసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంక్షేమంతో పాటు చేనేత రంగ పునరుజ్జీవనాన్ని కూడా సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారాలకు ఎంపికైన చేనేత కళాకారులను ఘనంగా సత్కరించి అభినందించారు. చేనేత రంగ అభివృద్ధికి వారు అందిస్తున్న విశిష్ట సేవలు కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు.
అనంతరం పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నైపుణ్యమైన చేనేత కళాకారులు ఏర్పాటు చేసిన 100కు పైగా స్టాల్స్‌ను సందర్శించి, వారి చేతి పనితనం, సంప్రదాయ నైపుణ్యం, ఆధునిక డిజైన్ల సమన్వయంతో రూపొందించిన వస్త్రాలను పరిశీలించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీతలు రూపొందించిన ప్రత్యేక చేనేత ఉత్పత్తులను ఆసక్తిగా వీక్షించి, వారి ప్రతిభను అభినందించారు. ఈ ప్రదర్శన ఆగస్టు 7 నుంచి 16 వరకు కొనసాగుతుందని, ప్రజలు పెద్ద ఎత్తున సందర్శించి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, చేనేత అనేది కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వానికి ప్రతీక అని అన్నారు. తరతరాలుగా సంక్రమించిన ఈ గొప్ప హస్తకళను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అంతరించిపోతున్న సంప్రదాయ చేనేత కళలకు పునర్వైభవం తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలంగాణ చేనేత ఉత్పత్తులు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించాయని మంత్రి పేర్కొన్నారు. గద్వాల చీరలు, పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట వస్త్రాలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్ దర్రీస్, కరీంనగర్ బెడ్‌షీట్లు వంటి ఉత్పత్తులు తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయని తెలిపారు. సంప్రదాయాన్ని ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
చేనేత రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్న మంత్రి, చేనేత కార్మికుల జియో ట్యాగింగ్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ద్వారా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందిస్తూ చేనేత రంగానికి కొత్త తరాన్ని సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఆ సంస్థలో విద్యనభ్యసించిన వగ్గు శ్రీరామ్ రూపొందించిన ఎర్గోనామిక్ బ్యాక్ సపోర్ట్ సిస్టమ్ జాతీయ స్థాయిలో తొలి బహుమతి సాధించడం తెలంగాణ చేనేత శిక్షణా వ్యవస్థ ప్రతిభకు నిదర్శనమని తెలిపారు.
చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు. రెండేళ్ల కాలపరిమితితో నేతన్న పొదుపు పథకం అమలవుతోందని, నేతన్నకు భద్రత పథకం ద్వారా మరణించిన చేనేత కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం అందిస్తున్నామని తెలిపారు. చేనేత రుణమాఫీ కోసం రూ.49.27 కోట్లు విడుదల చేశామని, నేతన్న భరోసా పథకం కింద చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ.18 వేల చొప్పున, అనుబంధ కార్మికులకు రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేలా రూ.15 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క), జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్,
హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకట్ రమణ  టెస్కో అధికారులు, చేనేత రంగ ప్రముఖులు, అవార్డు గ్రహీతలు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు
======================