సికింద్రాబాద్,అర్జున్ సమాచారం:
జవహర్ నగర్ డంప్ యార్డ్ వ్యతిరేక పోరాట అఖిలపక్ష నేతలు, జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలు బుధవారం నాడు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిసారు. జవహర్ నగర్ డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న సుదీర్ఘ ఆందోళనకు పార్టీలకు అతీతంగా నాయకత్వం వహించాలని వారు ఈ సందర్భంగా ఎంపీ ఈటలను కోరారు. 20 ఏళ్లుగా తాము చెత్త కుప్పల మధ్య, కాలుష్య కోరల్లో నరకప్రాయమైన జీవితాన్ని అనుభవిస్తున్నామని స్థానికులు ఎంపీ ఈటల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి విముక్తి లభించాలంటే ఈటల రాజేందర్ నాయకత్వమే సరైనదని వారు స్పష్టం చేశారు. ఇటీవల డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన వారిని పోలీసులు అక్రమంగా స్టేషన్లో నిర్బంధించినప్పుడు, ఎంపీ ఈటల రాజేందర్ స్వయంగా వచ్చి మద్దతు ప్రకటించారని, కష్టకాలంలో తమకు సంఘీభావం తెలిపినందుకు ఈటల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో.. జవహర్ నగర్ డంప్ యార్డ్‌ను ఇక్కడి నుండి పూర్తిగా తరలిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు నేతలు విమర్శించారు. జవహర్ నగర్ మరియు దాని పరిసర ప్రాంతాల ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ఎంపీ ఈటల రాజేందర్ పైనే ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎంపి ఈటల మాట్లాడుతూ జవహర్ నగర్ డంప్ యార్డ్ బాధితులకు సంఘీభావం తెలుపుతూ, ఈ పోరాటంలో తాను ముందుండి నడుస్తానని స్పష్టమైన భరోసా ఇచ్చారు. రాజకీయ పార్టీలను, జెండాలను పక్కనబెట్టి స్థానిక ప్రజలంతా ఏకతాటిపైకి రావడం అభినందనీయం. ఈ న్యాయమైన పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. డంప్ యార్డ్ చుట్టూ నివసిస్తున్న వారంతా తెలంగాణ పల్లెల నుండి వలసవచ్చిన నిరుపేదలే. వారి ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలాడుకోకూడదు. డంప్ యార్డ్ వ్యతిరేక ఉద్యమంపై నేను నిరంతరం కొట్లాడుతూనే ఉన్నాను. గతంలో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని, ఇక్కడ కరెంటు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత వారం కూడా మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి, గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం పనులు జరగాలని ఆదేశించాను. కానీ పాలకులు, అధికారులు మాట తప్పడం వల్లే నేడు జవహర్ నగర్ పరిసర ప్రాంతాలు మూసీ నది కంటే అధ్వాన్నంగా మారి, ఒక విషవలయాన్ని తలపిస్తున్నాయి. నేటి పాలకులకు ప్రజల బాధలు వినే తీరిక, ఓపిక లేదు. జేఏసీ నేతలు నిరసనకు పిలుపునివ్వగానే అక్రమ అరెస్టులకు దిగడం దుర్మార్గం. అరెస్టులు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. ప్రజాశక్తి ముందు ఎంతటివారైనా తలవంచాల్సిందే. నాపై గతంలో దాదాపు 200 కేసులు పెట్టారు. ప్రజా ఉద్యమాల్లో నడిచిన నాకు ఈ కేసులు, జైళ్లు కొత్తేమీ కాదు. ధర్మం, న్యాయం కోసం ఆకాశమే హద్దుగా పోరాడే తత్వం నాది. నేను ఒక్కసారి రంగంలోకి దిగితే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. కానీ, మన పోరాటం శాంతియుతంగా ఉండాలి, ఎక్కడా ఆస్తులను తగులబెట్టాల్సిన అవసరం లేదు. భయపడే వాళ్లనే భయపెడతారు, మనం భయపడాల్సిన పనిలేదని అన్నారు. .
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. గతంలో మీరే ఈ డంప్ యార్డుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కేసు వేశారు. ప్రశ్నించే గొంతుకగా నిలిచారు. ఇప్పుడు మీరే అధికారంలో, సమస్యను పరిష్కరించే స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇకనైనా తాత్సారం చేయకుండా వెంటనే పరిష్కారం చూపించండి.
జవహర్ నగర్ ప్రజల బాధలను దేశ రాజధానిలో వినిపిస్తాను. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ డంప్ యార్డ్ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడుతాను. ఇక్కడి నుండి డంప్ యార్డు ను పూర్తిగా తొలగించే వరకు మన పోరాటం ఆగదు. ఈ సమస్యకు ముగింపు పడేంత వరకు నేను మీలో ఒకడిగా ఉంటూ నాయకత్వం వహిస్తాను.. అని ఎంపీ ఈటల రాజేందర్ గారు స్థానికులకు బలమైన భరోసా ఇచ్చారు.
=================