ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 7:06 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ సేవలు శ్లాఘనీయం -ఏపీ హైకోర్టు మొదటి కోర్టు హాలులో జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ సంస్మరణ సభ -సంస్మరణ సభకు హాజరైన ఏపీ హైకోర్టు ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు

అమరావతి, నవంబర్ 23:అర్జున్ సమాచారం:
రాజ్యాంగపరమైన, పరిపాలనాపరమైన కేసుల విచారణలో జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ తనదైన ముద్ర వేశారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు.
జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం ఏపీ హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత ఫుల్ కోర్టు ఆయన మృతికి సంతాప సూచకంగా ఒక నిమిషం పాటు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ కుటుంబ సభ్యులు కూడా వర్చువల్ విధానంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ 1938 నవంబర్ 11న ప్రస్తుత చండీగఢ్ సమీపంలోని ఒక గ్రామంలో జన్మించారని తెలిపారు. ఆయన ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను అంబాలా, చండీగఢ్‌లలో పూర్తిచేశారని పేర్కొన్నారు. 1962లో న్యాయవాదిగా నమోదు చేసుకున్న ఆయన, తొలుత అంబాలా జిల్లా కోర్టులో కొంతకాలం న్యాయవాద వృత్తిని కొనసాగించి, 1964లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుకు మారారని వివరించారు.
1987 ఫిబ్రవరి 11న పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారని, 1997 జూలై 7న మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. అనంతరం 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వచ్చి, 2000లో పదవీ విరమణ చేసే వరకు ఆ పదవిలో కొనసాగారని పేర్కొన్నారు.
1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు ప్రభుత్వం 1992 డిసెంబర్ 16న జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ అధ్యక్షతన ఏకసభ్య విచారణ కమిషన్‌ను నియమించిందని ప్రధాన న్యాయమూర్తి గుర్తుచేశారు. సుమారు 17 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన అనంతరం జస్టిస్ లిబర్హాన్ 2009లో తన నివేదికను సమర్పించారని తెలిపారు.
ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభునాథ్ వాసిరెడ్డి మాట్లాడుతూ, జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ న్యాయ ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. న్యాయరంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన అనుసరించిన న్యాయమార్గం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. లక్ష్మీనారాయణ, ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ బాలాజీ, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, ప్రభుత్వ సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.