ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 4:50 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

టీఆర్ఎస్ పార్టీ పేరుపై కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు కేటాయింపు వివాదంలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది మే 12, జూన్ 23 న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వడానికి కవితకు అవకాశం కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం నోటీసులకు ఇప్పటివరకు స్పందించని కవిత నేరుగా మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం వారం రోజుల్లో కవిత తన అభిప్రాయాలను తెలిపిన తర్వాత వ్యక్తిగతంగానూ ఆమె వాదనలు విని తుది నిర్ణయం తీసుకోవాలని ఈసీకి హైకోర్టు సూచించింది. విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో పోలిక ఉన్న రెండు రాజకీయ పార్టీలు నమోదై ఉన్నందున అదే పేరును కవితకు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పేరుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని, గతంలో ఇలాంటి వ్యవహారాల్లో ఎవరికీ వ్యక్తిగతంగా వాదనలు వినడానికి అవకాశం ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదని ఇప్పటికే కవితకు స్పష్టం చేసినట్లు ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు కవిత తరఫు న్యాయవాది మాత్రం టీఆర్ఎస్ పేరును ఆమెకు కేటాయించాలని కోర్టులో వాదనలు వినిపించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో కవితకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండానే ప్రతికూల నిర్ణయం తీసుకోవడం సముచితం కాదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు వారం రోజుల్లో కవిత అభిప్రాయాలను తెలిపిన తర్వాత వ్యక్తిగతంగానూ ఆమె వాదనలు విని తుది నిర్ణయం తీసుకోవాలని ఈసీకి ఢిల్లీ హైకోర్టు సూచించింది.
===========================