ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 9:08 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఢిల్లీలో టెన్షన్…

న్యూఢల్లీ,జూలై 20,అర్జున్ సమాచారం:
కాక్రోచ్‌ జనతా పార్టీ తలపెట్టిన చలో సంసద్‌ నిరసన ర్యాలీ మరింత ఉద్రిక్తంగా మారింది. ఉదయమే నిరసనకారులను జంతర్‌ మంతర్‌ వద్ద నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. వాళ్లు ముందుకు సాగారు. పలు అంచెల్లో ఏర్పాటు చేసిన భద్రతను దాటుకొని మరీ దాదాపు పార్లమెంటు సమీపంలోకి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించాల్సి వచ్చింది. లాఠీఛార్జ్‌ కూడా చేశారు.ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని తోపులాట జరిగింది. దీంతో పలువురు నిరసనకారులతో పాటు పోలీసులకూ గాయాలయ్యాయి. ఇదంతా పార్లమెంటుకు 200 మీటర్ల దూరంలోనే జరిగింది. ఈ క్రమంలో పార్లమెంట్‌ ప్రధాన ద్వారాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కొన్ని గేట్లను మూసివేశారు.ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సెంట్రల్‌ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను కూడా నిలిపివేశారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు తమ కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలని సీజేపీ పిలుపునిచ్చింది. శాంతియుత పోరాటంతోనే లక్ష్యాన్ని సాధిస్తామని సోషల్‌ మీడియాలో పేర్కొంది.ఈ ఆందోళనకు ముందు పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఆత్మహత్య చేసుకున్న ఓ నీట్‌ విద్యార్థిని తండ్రి విజ్ఞప్తి మేరకు దీక్ష విరమించినట్లు సీజేపీ తెలిపింది. పార్లమెంట్‌ ర్యాలీకి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని ఆయనను ఒప్పించడంతో దీక్ష ముగిసిందని పార్టీ వెల్లడించింది.జంతర్‌మంతర్‌ వద్ద మరో వివాదం కూడా చెలరేగింది. ఎలాంటి అత్యవసర పరిస్థితి లేకపోయినా ఒక అంబులెన్స్‌ను నిరసన ప్రాంగణంలోకి పంపారని సీజేపీ ఆరోపించింది. దాంతో తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనను భంగం కలిగించేందుకే ఇలా చేశారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.
==========================