ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 5:04 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

తుడుం దెబ్బకు కొత్త నాయకత్వం.. ఆదివాసీల హక్కుల పరిరక్షణ, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని నాయకుల హామీ

తాండూర్,అర్జున్ సమాచారం:
మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీతో పాటు ఆదివాసీ విద్యార్థి మండల కమిటీలను ఘనంగా నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివాసీ సమాజ ఐక్యతను బలోపేతం చేయడం, రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, గిరిజన యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సంస్థను మరింత పటిష్ఠం చేయాలనే లక్ష్యంతో నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా తుడుం దెబ్బ మండల గౌరవ అధ్యక్షుడిగా అల్లంకొండ భీమన్న, మండల అధ్యక్షుడిగా యాపల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా బుర్సా ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఆదివాసీ విద్యార్థి మండల కమిటికి అధ్యక్షుడిగా పసుల ధర్మయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆలకుంట అంజన్న ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు.నూతన కమిటీ సభ్యులను జిల్లా, రాష్ట్ర నాయకులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీల భూ, అటవీ, విద్య, ఉపాధి, సంక్షేమ హక్కుల సాధన కోసం తుడుం దెబ్బ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు తొమ్మిది తెగల ఆదివాసీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యంగా పనిచేస్తామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు సంస్థను విస్తరించి, ప్రతి ఆదివాసీ కుటుంబానికి అండగా నిలుస్తామని నూతన కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పెంద్రం హనుమంత్, జాతీయ ఉపాధ్యక్షుడు ఆడ జంగు, రాష్ట్ర కార్యదర్శి మండిగ రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం మణికుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్సెంగ బాబురావు, జిల్లా కార్యదర్శి అరికేల శంకర్తో పాటు తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల నాయకులు, మండల నాయకులు, యువత, విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సమావేశం అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తుడుం దెబ్బ సంస్థ ఆధ్వర్యంలో ఆదివాసీ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, గిరిజన అభివృద్ధి కోసం మరింత సమిష్టిగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమం ఆదివాసీ ఐక్యతకు ప్రతీకగా, ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.