ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 7:49 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉం

అర్జున్ సమాచారం:
మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  అభినందనలు తెలిపారు. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఈగల్ ఫోర్స్ సాధించిన జాతీయ స్థాయి గుర్తింపు నిదర్శనమని పేర్కొన్నారు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (#ANTF) 3వ జాతీయ సదస్సులో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్  సందీప్ శాండిల్య అత్యుత్తమ అవార్డును అందుకోవడం రాష్ట్ర పోలీసు శాఖకు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ అనుసరిస్తున్న సమర్థవంతమైన విధానాలకు ఈ జాతీయ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు.

మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టడం కేవలం పోలీసు వ్యవస్థ బాధ్యత మాత్రమే కాదని, యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం ప్రతి కుటుంబం, ప్రతి పాఠశాల, ప్రతి సంస్థ, ప్రతి పౌరుడి సమిష్టి బాధ్యత అని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.

యువతే రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అని పేర్కొంటూ, మాదకద్రవ్యాల ప్రభావం నుంచి యువతను రక్షించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, డ్రగ్స్‌ విక్రయం, వినియోగంపై సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.“‘నషా ముక్త భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు తెలంగాణ నుంచి బలమైన అడుగు పడాలి. 2029 డిసెంబర్ నాటికి డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే దిశగా ఈగల్ ఫోర్స్ మరింత దృఢ సంకల్పంతో పనిచేయాలి” అని ముఖ్యమంత్రి  ఆకాంక్షించారు. మాదకద్రవ్యాలపై పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తూ, యువతను చైతన్యపరచడం, డ్రగ్స్ అక్రమ రవాణా మరియు విక్రయాలపై ఉక్కుపాదం మోపడం, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం ద్వారా సురక్షితమైన, ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి  స్పష్టం చేశారు.
======================