కరీంనగర్,అర్జున్ సమాచారం:
840 కోట్ల రూపాయల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ నిధులతో చేపట్టిన అనేక పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. నగరంలో చెత్త నిర్వహణ, పాత చెత్త డంప్యార్డుల శుద్ధీకరణ, నదీతీర అభివృద్ధి, పట్టణ రవాణా మెరుగుదల, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, పునరావాసం, వరదల ప్రభావాన్ని తగ్గించే మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులున్నాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
బుధవారం నాడు అయన కలెక్టరేట్ దగ్గర మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద 5 కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో సెంట్రల్ లైబ్రరీని ప్రారంభించాం. 16 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డీఆర్ఎఫ్ బిల్డింగ్ ను ప్రారంభించుకున్నాం.కశ్మీరీ గడ్డలో 6 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రారంభించుకున్నామని అన్నారు.
వర్షపు నీటి డ్రెయిన్ల నిర్మాణం కోసం 21 కోట్ల రూపాయలతో పనులకు శంకుస్థాపన జరిగింది. కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద పార్కింగ్ సమస్య లేకుండా 25 కోట్ల రూపాయలతో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణ పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. ఈనెల 4న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరీంనగర్ వస్తున్నారు. సంఘ్ పరివార్ లేని భారత్ ను ఊహించుకునే స్థితిలో ప్రపంచమే లేదు. కాంగ్రెస్ లేని భారత్ ను చూడాలని దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అందుకే కాంగ్రెస్ 3, 4 రాష్ట్రాలకే పరిమితమైంది. 370 ఆర్టికల్ ను మళ్లీ ప్రవేశపెట్టాలని సిలబస్ లో చేరుస్తారా, కాశ్మీర్ పాకిస్తాన్ లో అంతర్భాగమని చెబుతారా. అయోధ్యలో రామ మందిరం లేదు బాబ్రీ మసీదు ఉందని చెబుతారా, సర్జికల్ స్ట్రయిక్స్ లేవు పాకిస్తాన్ వాళ్లే వచ్చి దాడులు చేయాలని చెబుతారా, సైనికులకు మోదీ స్వేచ్ఛ ఇచ్చారు ఇవ్వొద్దని సిలబస్ లో చెబుతారా, నిజాం చాలా గొప్పోడని సిలబస్ లో చెబుతారా హిందు దేవాలయాలపై దాడులు చేయాలని, మహిళలను అర్ధ నగ్నంగా బతకమ్మలా ఆడించాలని చెబుతారా, రజాకార్ల దాడుల్లో అసువులు బాసిన వారి చరిత్రను తెరమరుగు చేస్తారా, సర్దార్ పటేల్ వద్దు నిజాం ముద్దు అని చెబుతారా అని ప్రశ్నించారు.
దేశాన్ని కాంగ్రెస్ పార్టీ చీలుస్తోంది. హిందూ సమాజాన్ని చీల్చాలని కుట్ర చేస్తోంది. దేశమంతా హరహర మహాదేవ్ అని మార్మోగుతోంది. మోదీ ప్రాతినిధ్యం వహిస్తోంది వారణాసి నుండే కదా. సర్వే జన సుఖినోభవంతు అన్నదే హిందూ ధర్మం. రాముడిని బీజేపీకే పరిమితం చేసినందుకు సీఎంకు థ్యాంక్స్ చెప్పాలేమో. దేవుళ్లను విభజిస్తున్న సీఎంను చూసి కాంగ్రెస్ నేతలే అసహ్యించుకుంటున్నారు.. ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడాలి. రాముడు, శివుడి పేరుతో దైవాన్ని చీల్చాలనుకుంటే హిందూ సమాజం తిరగబడటం తథ్యమని అన్నారు.