ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 6:39 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

నాగార్జున సాగర్‌లో ఏపీ అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలి – కేఆర్ఎంబీకి జగదీష్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు • మంచినీటి పేరిట రూ.100 కోట్లతో రహస్యంగా పనులు చేపట్టారని ఆరోపణ • అదనపు 9 టీఎంసీల ప్రతిపాదనను అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి వినతిపత్రం • తెలంగాణ జలాలను ఆంధ్రాకు కట్టబెట్టారంటూ రేవంత్ సర్కార్‌పై విమర్శలు

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నడిగర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించేందుకు నిర్మాణాలు చేపట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ పనులను తక్షణమే నిలిపివేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అధికారులను కలిసి ఆయన లేఖ అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మంచినీటి అవసరాల పేరిట నాగార్జున సాగర్ వద్ద ఇన్‌టేక్ వెల్ (సొరంగం) నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం రహస్యంగా ప్రారంభించిందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కేఆర్ఎంబీ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర ప్రభుత్వంతో పాటు పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఈ పనులు చేపట్టారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వెచ్చించి, 20 శాతానికి పైగా నిర్మాణాన్ని పూర్తి చేశారని, ఈ అక్రమ పనులకు అడ్డుకట్ట వేయాలని కేఆర్ఎంబీని కోరినట్లు ఆయన వివరించారు.
రెండో పంట కోసం 9 టీఎంసీల డ్రామా..?
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నాగార్జున సాగర్ నుంచి తన వాటాకు మించి నీటిని వినియోగించుకుందని జగదీష్ రెడ్డి అన్నారు. కుడి కాలువ ద్వారా ఇష్టానుసారంగా నీటిని తరలించి శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలను ఖాళీ చేసే పరిస్థితి తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. దీనికి తోడు తమ రాష్ట్రంలో రెండో పంట పండించుకునేందుకు మంచినీటి సాకుతో మరో 9 టీఎంసీల నీటిని కోరుతూ కేఆర్ఎంబీ ఎజెండాలో పెట్టించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. కేవలం 30 లక్షల మంది ప్రజలు మూడు నెలల్లో 9 టీఎంసీల మంచినీరు తాగుతారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొనడం వాస్తవ దూరమని ఆయన వ్యాఖ్యానించారు.