అర్జున్ సమాచారం:
: కేంద్రం ప్రభుత్వం పై, ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ‘దేశద్రోహి’ అని, ఆయనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంత్రిస్తున్నారని ఆరోపించారు. తనతో చర్చకువస్తే మోదీ దేశ ద్రోహి అనే ఆ విషయాన్ని ఐదు నిమిషాల్లో నిరూపిస్తానని అన్నారు.
ఈ అంశంపై చర్చకు రావాలని ప్రధానికి సవాల్ విసిరితే పార్లమెంటులో చర్చిద్దామని ఎన్డీయే నేతలు అంటున్నారని చెప్పారు. కానీ లోక్‌సభలో తాను మాట్లాడకుండా మైక్ కట్ చేస్తారని విమర్శించారు. దేశంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు షా మూడేళ్ల గడువు పెట్టారని, అయితే అప్పటికి ఆయన ఆ పదవిలో ఉంటారో లేదో..? అని ఎద్దేవా చేశారు. తన అంచనా ప్రకారం ఏడాదిలోపే ప్రభుత్వం కూలిపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో బుధవారం జరిగిన ఇన్సాఫ్ ర్యాలీలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. తాను అమిత్ షాను ఒక్కటే అడగాలనుకుంటున్నానని, అదానీ ఓడరేవులో పట్టుబడిన మాదకద్రవ్యాల సంగతేంటి..? ఆ విషయంలో మీరు తీసుకున్న చర్యలేమిటి..? అని ప్రశ్నించారు. మీరు పైకి శాంతిభద్రతల గురించి మాట్లాడుతున్నారని, కానీ మీరు గ్యాంగ్‌స్టర్లను ప్రోత్సహిస్తున్నారని దేశం మొత్తానికి తెలుసని అమిత్ షాను ఉద్దేశించి అన్నారు. ఒకవేళ అమిత్ షా శాంతిభద్రతల గురించి మాట్లాడాలనుకుంటే మణిపుర్‌లో ఏం జరుగుతుందో దేశానికి చెప్పాలని రాహుల్‌గాంధీ అన్నారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్‌పైనా రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తామని భగవంత్ మాన్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ వారు ఎక్కడ నిర్మూలించారని ప్రశ్నించారు. పంజాబ్‌లో ఏ ఒక్క ప్రాంతం నుంచైనా వారు డ్రగ్స్‌ను నిర్మూలించారా..? అని నిలదీశారు. సమస్యను అంతంచేసే సామర్థ్యం వారికి లేదని రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. గతంలో లోక్‌సభలో భగవంత్ మాన్‌తో కలిసి కూర్చున్న సమయంలో ఆయన జోకులు వేసేవారని, ఆయన వద్ద మద్యం వాసన వచ్చేదని ఆరోపించారు. మాదక ద్రవ్యాలపై పోరాడలనుకుంటే ముఖ్యమంత్రి మద్యం మత్తులో ఉండకూదని మాన్‌కు రాహుల్ చురకలంటించారు. సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సచిన్ పైలట్ కూడా పాల్గొన్నారు.
========================