ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 8:56 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పశ్చిమ బెంగాల్‌లో మరో ఎన్‌కౌంటర్.. – పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ఘటన – ఆయుధం రికవరీ చేస్తుండగా పోలీసులపై కాల్పులు – ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామన్న పోలీసులు – నేరగాళ్లకు రాష్ట్రంలో స్థానం లేదన్న సీఎం సువేందు అధికారి

 బర్ధమాన్, అర్జున్ సమాచారం:
పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపిన కేసులో నిందితుడిగా ఉన్న హిస్టరీ షీటర్, పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. బీర్‌భూమ్ జిల్లా నానూర్‌లోని ఓ ఇటుక బట్టీ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.  రతన్ షేక్ అనే హిస్టరీ షీటర్‌ను అరెస్ట్ చేసేందుకు నవంబర్ 13న శాంతినికేతన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాయిక్ బజార్ వద్ద పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులపై కాల్పులు జరపగా, కానిస్టేబుల్ బిశ్వజిత్ దాస్ ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. అనంతరం షేక్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన కానిస్టేబుల్‌ను మొదట బోల్‌పూర్ ఆసుపత్రికి, ఆ తర్వాత బర్ధమాన్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న రతన్ షేక్‌ను పోలీసులు ఆదివారం పక్కనే ఉన్న పుర్బా బర్ధమాన్ జిల్లాలోని నవాబ్‌హట్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్‌పై కాల్పులకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకునేందుకు అతడిని నానూర్‌లోని ఇటుక బట్టీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ దాచిపెట్టిన ఆయుధాన్ని బయటకు తీసిన షేక్, మరోసారి పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపగా, షేక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని నానూర్‌లోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంత్ర గ్రామ నివాసి అయిన షేక్‌పై దొంగతనం, దోపిడీ, నార్కోటిక్స్ వంటి పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పందించారు. “పోలీసులపై ఎవరైనా కాల్పులు జరిపితే, వారికి పోలీసులు స్వీట్లు పంచాలా? రాష్ట్రంలో నేరగాళ్లకు స్థానం లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన గత ఆరు నెలల్లో రాష్ట్రంలో ఇది ఐదో పోలీస్ ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం.
======================