జగిత్యాల,అర్జున్ సమాచారం:
జిల్లాలో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు పోలీస్, అటవీ శాఖలు పరస్పర సమన్వయంతో మరింత సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్, సూచించారు. ఈ రోజు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో పోలీస్, అటవీ శాఖల అధికారులతో నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో జిల్లాలో అటవీ పరిరక్షణకు సంబంధించి చేపడుతున్న చర్యలు, ఇరు శాఖలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరస్పర సహకారం అవసరమైన అంశాలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలు, అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేట, అటవీ భూముల ఆక్రమణ తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అటవీ భూములు ఆక్రమణ, అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేటను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అధికారులకు సూచించారు. అటవీ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా పెంచాలని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై సమాచారాన్ని సేకరించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు, అటవీ శాఖకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని పోలీస్ శాఖతో పంచుకోవాలని సూచించారు.అటవీ భూముల ఆక్రమణకు సంబంధించిన అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ పేర్కొన్నారు. అటవీ భూముల్లో అనధికారికంగా చేపడుతున్న కార్యకలాపాలను గుర్తించి, సంబంధిత శాఖల సమన్వయంతో వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా వేటగాళ్ల కదలికలపై నిఘా పెంచాలని, అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజలతో సమన్వయం చేసుకుని అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం సేకరించాలని తెలిపారు.అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, వన్యప్రాణుల వేట, కలప అక్రమ రవాణా, అటవీ భూముల ఆక్రమణ వల్ల కలిగే నష్టాలపై వివరించాలని సూచించారు.