ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 8:20 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పోలీస్ స్టేషన్‌ ముందు రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడితో కలిసి ఎఫ్‌ఐఆర్‌ కోసం డిమాండ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 21,అర్జున్ సమాచారం:
పెల్లెట్ గన్ గాయాల వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలో ఆందోళనకు దిగారు. జులై 20న జరిగిన జెన్‌-జీ విద్యార్థుల నిరసనల్లో పెల్లెట్ గన్ గాయాలయ్యాయని ఆరోపిస్తున్న సాహిల్ లోచాబ్‌ను వెంటబెట్టుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అనంతరం సీనియర్ పోలీస్ అధికారి కార్యాలయం బయట బాధితుడితో కలిసి ధర్నాకు కూర్చున్నారు.జులై 20న పరీక్షల పేపర్ లీక్‌లకు నిరసనగా వందలాది మంది విద్యార్థులు పార్లమెంట్ వైపు మార్చ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్’ (ఆర్‌ఏఎఫ్‌) సిబ్బంది పెల్లెట్ గన్స్ ఉపయోగించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఘటనలో గాయపడినట్లు పలువురు నిరసనకారులు చెప్పడంతో పాటు వైద్య నివేదికలు కూడా ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది.అయితే జులై 20న పెల్లెట్ గన్స్ ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు పలుసార్లు తెలిపారు. ఈ అంశంపై సీఆర్‌పీఎఫ్‌ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు, గాయపడిన నిరసనకారుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు పెల్లెట్ గన్స్ వాడలేదన్న వాదనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని కాంగ్రెస్‌ పేర్కొంది.
======================