ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 7:49 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్రజలకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం రూ.360 కోట్ల‌తో రెవెన్యూ శాశ్వ‌త భ‌వ‌నాలు 10 ఆర్డీవో,107 త‌హ‌శీల్ధార్‌, 53 స‌బ్ రిజిస్ట్రార్ భ‌వ‌నాల నిర్మాణం – రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
రాష్ట్రంలో రెవెన్యూ పరిపాలనను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు ఆధునిక, గౌరవప్రదమైన సేవలు అందించాలనే లక్ష్యంతో  ద‌శ‌ల‌వారీగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
భ‌వనాల నిర్మాణాల‌పై మంగ‌ళ‌వారం నాడు అధికారుల‌తో మంత్రి గారు స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తొలివిడ‌త‌లో  అద్దె భవనాలు, శిథిలావస్థలో ఉన్న 107  తహసీల్దార్ కార్యాలయాలు, 10 ఆర్డీవో కార్యాలయాలకు 263 కోట్ల రూపాయిల‌తో అలాగే స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖ‌కు సంబంధించి   రూ.97 కోట్ల రూపాయిల‌తో 48 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆదిలాబాద్‌, ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో  జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు,  నిజామాబాద్, వ‌రంగ‌ల్ జిల్లాల్లో  డీఐజీ కార్యాలయాలను నిర్మిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మొత్తం భ‌వ‌నాల కోసం  రెండు విభాగాల‌కు సంబంధించి 360 కోట్ల రూపాయిల‌తో  పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ భవనాలన్నీ ఒకే నమూనాలో, ఆధునిక సౌకర్యాలతో నిర్మించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా రూపొందిస్తామని చెప్పారు. వీటి నిర్మాణ బాధ్యతను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు.

గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

హౌసింగ్ అధికారులు జిల్లా స్ధాయిలో రెవెన్యూ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని  కొత్త భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి నిర్మాణ పనులను వేగంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.  రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సేవలందించే కార్యాలయాలు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించబడతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.
===========================