ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 5:08 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్రభుత్వ సేవలు మరింత సులభతరం మనమిత్ర ద్వారా ఫిర్యాదుల స్వీకరణ -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపిన అధికారులు
అమరావతి, జూన్ 29,అర్జున్ సమాచారం :
ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే అంశంపై అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు సేవల్ని సులభతర ప్రక్రియను మొదలు పెట్టామని.. ముందుగా 11 రకాల సేవల్లో ప్రక్రియలను కుదిస్తున్నామని అధికారులు తెలిపారు. అలాగే ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్లో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు… మనమిత్ర వాట్సాప్‌లో కూడా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించాలన్నారు. వాయిస్ మెసేజెస్ పెట్టినా వాటిని కూడా ఫిర్యాదులుగా స్వీకరించేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో సుమారు 3 వేల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని.. మూడు నెలల్లో సమస్య పరిష్కరించాలన్నారు. ఈ మేరకు నెట్‌వర్క్ సంస్థలతో మాట్లాడాలని సూచించారు. నవచేతన పేరుతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్ స్క్రీనింగ్ విధానంపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పిల్లల ఎదుగుదల, వారి మానసిక, శారీరక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్టు అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 33,949 మంది పిల్లలను స్క్రీన్ చేసినట్టు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేవారితో పాటు ఇళ్లకు కూడా వెళ్లి స్క్రీనింగ్ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్పారు. స్క్రీనింగ్‌తో పాటు… ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై పైలెట్ ప్రాజెక్ట్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
===============================