ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 8:05 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్రీవెంటివ్ పోలీసింగ్ వైపు కామారెడ్డి పోలీసుల అడుగులు. ‘ఆపరేషన్ కవచ్’ ద్వారా నిరూపణ, విజయవంతంగా ఏడాది పూర్తి. ప్రజలకు రక్షణ కవచంలా, కొండంత ధైర్యంలా ……..కామారెడ్డి పోలీసుల ఏడాది ఆదర్శ ప్రస్థానం. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, దిశానిర్దేశంలో ‘ఆపరేషన్ కవచ్’ విజయవంతంగా ఏడాది పూర్తి. కామారెడ్డి పోలీసుల అచంచల విశ్వాస ప్రస్థానం.

కామారెడ్డి,అర్జున్ సమాచారం:                                                                                                రాత్రి వేళల్లో జగమంతా నిశ్శబ్దంగా నిద్రకు ఉపక్రమిస్తుంది. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించిన సామాన్యుడు హాయిగా కనుమూసేవేళ అది. కానీ, అదే సమయంలో నల్లని చీకట్లను చీల్చుకుంటూ, కంటిమీద కునుకు లేకుండా కాపలా కాసే రక్షక పోలీసులు రోడ్లపైకి వస్తారు. వర్షం కురుస్తున్నా, చలి వణికిస్తున్నా.. ప్రజల భద్రతే పరమావధిగా రోడ్లపై పహారా కాసే ఖాకీ సైన్యం అది. కామారెడ్డి జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర,  దిశానిర్దేశంలో ప్రీవెంటివ్ పోలీసింగ్ (నేర నియంత్రణ) వ్యూహంతో సరిగ్గా ఏడాది క్రితం 25 జులై 2025 నాడు ప్రారంభమైన “ఆపరేషన్ కవచ్” (Operation Kavach) 24 జులై 2026 నాటికి  విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది.
ఈ ఏడాది కాలంలో ఈ వినూతన ఆపరేషన్ నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తూనే, ప్రజలకు నమ్మకమైన రక్షణ కవచంగా నిలిచింది. ప్రజలు సుఖంగా నిద్రపోవడానికి పోలీసులు రాత్రంతా నిద్రలేని క్షణాలు గడుపుతూ చేసే వాహన తనిఖీలు కేవలం బాధ్యత మాత్రమే కాదు.. అవి ప్రజల ఆస్తి, ప్రాణాలకు, యువత చెడు దారి పట్టకుండా భరోసా ఇచ్చే అభేద్యమైన కోటలుగా నిలిచాయి.