ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 8:30 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

బీజేపీ, అకాలీదళ్ పొత్తు

ఛండీఘడ్,అర్జున్ సమాచారం:
పంజాబ్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈసారి ఎలాగైనా అక్కడ అధికారం చేజిక్కించుకోవాలని పావులు వేగంగానే కదుపుతోంది. అయితే.. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీ.ఎల్. సంతోష్ ఓ కీలక ప్రకటన చేశారు. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించారు. అయినా… అటు బీజేపీ, ఇటు అకాలీదళ్ పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి. అడపా దడపా ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతూనే వున్నాయి. కానీ.. ఓ పట్టాన తుది దశకు రావడం లేదు.ఇంత జరుగుతున్నా.. పొత్తుపై రెండు పార్టీలూ ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. అయితే.. ఇరు పార్టీల మధ్య పొత్తు వుండాలన్న తుది నిర్ణయానికి మాత్రం వచ్చేశాయి. ఈ సారి బీజేపీ అక్కడ పై చేయి సాధించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తానే సీనియర్ భాగస్వామిగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యింది. దీంతో అకాలీదళ్ అటూ ఇటూగా వున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ భాగస్వామి అయితే మాత్రం సీట్ల విషయంలో దెబ్బే.. అన్నట్లుగా ఆలోచిస్తోంది. ఎక్కువ సీట్లు అడగడానికి అకాలీదళ్ కి ఛాన్స్ వుండకపోవచ్చు.అయితే.. పొత్తుకు అవకాశం ఉందనడానికి ఒక కీలక సూచన ఏమిటంటే, గ్రామీణ ప్రాంతాల్లోని సీట్లకు సిద్ధం కావద్దని ఎస్ఏడీ తమ నాయకులకు సూచించినట్లు సమాచారం. దీనిని బట్టి, గత పొత్తులో కంటే బీజేపీ ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతలో, పంజాబ్‌లో బీజేపీ తన సంస్థాగత సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇటీవల ఆ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా, మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సన్నద్ధం కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.అకాలీ దళ్ మరియు బీజేపీలు దీర్ఘకాల మిత్రపక్షాలుగా ఉన్నాయి, అయితే వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా సెప్టెంబర్ 2020లో అవి విడిపోయాయి.ఇవి కలిసి ఆరు లోక్‌సభ (1998, 1999, 2004, 2009, 2014 మరియు 2019) మరియు ఐదు పంజాబ్ అసెంబ్లీ (1997, 2002, 2007, 2012 మరియు 2017) ఎన్నికలలో పోటీ చేశాయి. విడివిడిగా పోటీ చేసిన 2022 పంజాబ్ ఎన్నికలలో, అకాలీ దళ్ కేవలం మూడు స్థానాలను మాత్రమే గెలుచుకుని దారుణంగా పడిపోయింది. బీజేపీ రెండు స్థానాలనే గెలుచుకుంది.
=================