ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 6:21 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

భారత్ పై 100 శాతం టారిఫ్…. దేశప్రయోజనాలే ముఖ్యమన్న భారత్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19,అర్జున్ సమాచారం:
రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులపై అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 18న ‘సాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2026’పై సంతకం చేయడంతో కొత్త చట్టానికి ఆమోదం లభించింది. ఉక్రెయిన్‌పై దాడులకు రష్యాకు వెళ్లే నిధులను ఆపడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. రష్యాపై ఈ కఠిన ఆంక్షల బిల్లుకు ఆమోదం లభించడంతో భారత్, చైనా వంటి దేశాలపై ఇకపై 100 శాతం టారిఫ్ విధించే అవకాశాలున్నాయి. ఈ రెండు ఆసియా దేశాలు రష్యా నుంచి భారీ స్థాయిలో చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. లిండ్సే ఓ. గ్రాహమ్ సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026 అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు రష్యా నుంచి భారీ స్థాయిలో చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100% టారిఫ్ విధించే అధికారం లభిస్తుంది. ఈ కొత్త చట్టం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, కీలక ఆర్థిక సంస్థలు, ప్రస్తుత సముద్ర ఆంక్షలను తప్పించుకోవడంలో ఉపయోగించే ట్యాంకర్ల ‘షాడో ఫ్లీట్’పై కూడా ఆంక్షలు విధిస్తుంది.ఉక్రెయిన్‌లో యుద్ధం తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా వందలాది చమురు ట్యాంకర్లతో ఒక సీక్రెట్ నేవీని సిద్ధం చేసింది. దీనిని షాడో ఫ్లీట్ అని అంటారు. ఈ కొత్త అమెరికా చట్టం ఈ అనుమానాస్పద ట్యాంకర్లను బ్లాక్‌లిస్ట్ చేస్తుంది, అలాగే ఈ నౌకలు అంతర్జాతీయ పోర్టుల్లో నిలవకుండా, ఇన్సూరెన్స్ సైతం పొందకుండా, సముద్ర మార్గాలను ఉపయోగించకుండా అడ్డుకోవడానికి అమెరికా నేవీ, ఇంటెలిజెన్స్‌కు ప్రత్యేక అధికారాలు కూడా ఇస్తుంది.రష్యాపై ఆంక్షలు విధించే బిల్లు లక్ష్యం.. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయడం, తద్వారా ఉక్రెయిన్‌తో యుద్ధం చేయడానికి వారికి లభించే నిధుల కొరత ఏర్పడేలా చేయడం. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం, అమల్లోకి వచ్చిన తర్వాత గత 12 నెలల్లో రష్యా నుంచి అత్యధిక మొత్తంలో ముడి చమురు లేదా సహజ వాయువు కొనుగోలు చేసి, భవిష్యత్తులో కొనుగోళ్లు కొనసాగించే 5 దేశాలకు ఇది షాకివ్వనుంది. భారత్, చైనా దేశాలు రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ లకు అతిపెద్ద కొనుగోలుదారులుగా ఉన్నాయి. దేశంలోని 140 కోట్ల ప్రజల ఇంధన భద్రతను నిర్ధారించడానికి పూర్తిగా కట్టుబడి ఉందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్ తమ దేశానికి అందుబాటు ధరల్లో, విశ్వసనీయ వనరులు అవసరమని పేర్కొంది. ట్రంప్ కొత్త చట్టం తర్వాత కూడా భారత్ రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు కొనసాగిస్తే, భారత్- అమెరికా మధ్య ఉన్న ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత్ పరోక్షంగా అమెరికా టారిఫ్ విధానాలను వ్యతిరేకించింది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగితేనే మనకు ప్రయోజనం ఉంటుందని, ఏకఛత్రాధిపత్యాన్ని ఎవరూ ప్రోత్సహించకూడదని సూచించింది.