ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 8:21 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు

కరీంనగర్,అర్జున్ సమాచారం:
కరీంనగర్‌లో భారీ స్థాయిలో జరిగిన పెట్టుబడి మోసం కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. పెట్టుబడి పథకాల ద్వారా ప్రజలను ఆకర్షించి కోట్లాది రూపాయలు సేకరించి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ రాయ్తో పాటు రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
2020లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో స్థాపించిన ఈ సంస్థ ద్వారా వివిధ పెట్టుబడి పథకాలను ప్రవేశపెట్టి తక్కువ కాలంలో పెట్టుబడులకు రెండింతలు, మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికినట్లు విచారణలో వెల్లడైంది. నెట్‌వర్క్ చైన్ విధానంలో కొత్త పెట్టుబడిదారుల నుంచి సేకరించిన మొత్తాలతో పాత పెట్టుబడిదారులకు చెల్లింపులు చేస్తూ మరింత మందిని పెట్టుబడులకు ఆకర్షించినట్లు పోలీసులు తెలిపారు.
కరీంనగర్ జిల్లా సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించారు. కొంతకాలం చెల్లింపులు చేసిన అనంతరం మే 2024 నుంచి చెల్లింపులు నిలిపివేసి పెట్టుబడిదారులను మోసం చేసినట్లు విచారణలో తేలింది.
ఈ వ్యవహారంపై బాధితుడు గుగులోత్ శివరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, సీపీ ఆదేశాల మేరకు కేసును సిసి పిఎస్ కరీంనగర్‌కు బదిలీ చేశారు.
రీంనగర్ ఇన్‌స్పెక్టర్ ఆర్. ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి, 18-09-2026 రాత్రి లక్నోలోని నిందితుల నివాసంలో హేమంత్ కుమార్ రాయ్, రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను అదుపులోకి తీసుకుంది. నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను లక్నోలోని గౌరవనీయ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించారు.
కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన సిసి ఎస్ ఇన్‌స్పెక్టర్ ఆర్. ప్రకాశ్ గౌడ్, ఎస్సై డి. మహిపాల్ రెడ్డి మరియు సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు.
=====================