ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 7:56 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

భారీ వర్షాలతో వంశధార, నాగావళి నదులకు వరద ఉద్ధృతి గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ నారాయణపురం ఆనకట్ట వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన నదుల్లోకి ఈత, చేపల వేటకు వెళ్లొద్దని విపత్తుల సంస్థ హెచ్చరిక

అర్జున్ సమాచారం:
భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని ప్రధాన నదులైన వంశధార, నాగావళిలో వరద ఉద్ధృ క్రమంగా పెరుగుతోంది. నదీ ప్రవాహం పోటెత్తుతుండటంతో అధికారులు ప్రధాన బ్యారేజీల వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం ఈ బ్యారేజ్‌లోకి 41,014 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, అంతే మొత్తంలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగావళి నదిలోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది. తోటపల్లి బ్యారేజ్ వద్ద ఇన్-ఫ్లో, అవుట్-ఫ్లో 45,661 క్యూసెక్కులుగా నమోదవుతోంది. నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట వద్ద ప్రవాహం 59,700 క్యూసెక్కులకు చేరడంతో అధికారులు అక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరికను అమలులోకి తెచ్చారు. ఈ పరిస్థితులపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పందిస్తూ.. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వరద తీవ్రత దృష్ట్యా నదుల్లోకి ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటి పనులు అత్యంత ప్రమాదకరమని, అటువంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
===========================