ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 6:43 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

కరీంనగర్,అర్జున్ సమాచారం:
భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.
భూ రీ-సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీ, పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై మంత్రి, శనివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొనగా..కరీంనగర్  జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ భారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలకు పూర్తిస్థాయిలో చేరలేకపోయామని తెలిపారు.
ధరణి కాలంలో పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించి, హైకోర్టు సమస్యను కూడా పరిష్కరించినప్పటికీ అధిక సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, తిరస్కరణ లకు గల కారణాలను గుర్తించి పరిష్కరించా లని అధికారులను ఆదేశించారు.
భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే భూ రీ-సర్వే తప్పనిసరి అని మేధావులు సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందు కోసం శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లైసెన్స్ సర్వేయర్లకు ఉద్యోగం లేదా రెగ్యులరైజేషన్ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి ములుగుమాడు గ్రామ రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు పంపిణీ చేశారని గుర్తు చేశారు.
తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే చేపట్టినట్లు తెలిపారు.
రీ-సర్వేకు అవసరమైన అత్యుత్తమ నాణ్యత గల పరికరాలను జిల్లా స్థాయిలో కొనుగోలు చేయాలని, కొనుగోలు ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్లు భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని అవసరమైన సిబ్బంది,పరికరాలు, మౌళిక వసతులు సమకూర్చాలని ఆదేశించారు.
ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షిస్తామని, మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ.50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 చెల్లించి మొత్తం రూ.60 అందజేస్తామని తెలిపారు. చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
విధుల్లో చేరని లైసెన్స్ సర్వేయర్లకు గడువిచ్చి, గడువులోగా చేరని వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. లైసెన్స్ సర్వేయర్లకు బీమా,సామాజిక భద్రత కల్పించే చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించారు. ఒక సర్వే నంబరులో కొంత భూమి మాత్రమే ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో భూముల రీ సర్వేకు సంబంధించి..  గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సమస్యలున్న చోట దరఖాస్తులు స్వీకరించి సత్వరం పరిష్కరించాలని పేర్కొన్నారు.  గ్రామాల వారీగా జేపీఓ, ఏఈఓ, సర్వేయర్లను భాగస్వాముల్ని చేసి ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. భూములను రీ సర్వే చేసే లైసెన్స్ సర్వేయర్లు వెంటనే విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వేకు అవసరమైన పరికరాలను కొన్నింటిని ఇప్పటికే తెప్పించామని.. మరికొన్నింటిని త్వరలోనే తీసుకొస్తామని పేర్కొన్నారు.
===========================