ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 8:30 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మానవ మేధస్సును ఏఐ భర్తీ చేయలేదు.. అవసరమైన చోటే వినియోగించాలి మాజీ సీబీఐ డైరెక్టర్ డాక్టర్ ఎం. నాగేశ్వరరావు

అర్జున్ సమాచారం :                               ఘనంగా నేషనల్ ప్రెస్ డే – 2026 జాతీయ సెమినార్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ మానవ మేధస్సును పూర్తిగా భర్తీ చేయలేదని, మానవ మెదడు ఆలోచనా శక్తి, విచక్షణ, నిర్ణయ సామర్థ్యం ముందు ఏఐ ఒక సహాయక సాంకేతిక సాధనం మాత్రమేనని మాజీ సీబీఐ డైరెక్టర్ డాక్టర్ ఎం. నాగేశ్వరరావు, ఐపీఎస్ (రిటైర్డ్) అన్నారు. ఏఐను అవసరమైన చోట మాత్రమే వినియోగించుకోవాలని, మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా మార్చకూడదని సూచించారు.
జాతీయ పత్రికా దినోత్సవం – 2026 సందర్భంగా నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) ఆధ్వర్యంలో సోమవారం సికింద్రాబాద్‌లోని రెజొనెన్స్ కాలేజ్, కార్ఖానా క్యాంపస్‌లో “ఏఐ యుగంలో పత్రికా స్వేచ్ఛ (Freedom of Press in the AI Era)” అనే అంశంపై జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ నాగేశ్వరరావు కీలకోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీడియా రంగంలో ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొందని, వార్తలను వేగంగా అందించాలనే పోటీలో వాస్తవాలు, విశ్వసనీయత, జర్నలిజం విలువలను విస్మరించకూడదని అన్నారు. ఏఐ వార్తల సేకరణ, విశ్లేషణ, రచన, ప్రసారంలో ఉపయోగపడుతున్నప్పటికీ మానవ ఆలోచనా శక్తి, అనుభవం, విచక్షణను భర్తీ చేయలేదని పేర్కొన్నారు.
రాజకీయ నాయకుల ఆధీనంలో మీడియా సంస్థలు.. నిష్పక్షపాత జర్నలిజం ఎలా సాధ్యం?

మీడియా సంస్థల యాజమాన్య వ్యవస్థపై డాక్టర్ నాగేశ్వరరావు కీలక ప్రశ్నలు లేవనెత్తారు. అనేక మీడియా సంస్థలు రాజకీయ నాయకుల ఆధీనంలో లేదా రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్నప్పుడు, వాటి నుంచి నిష్పక్షపాతమైన, పారదర్శకమైన జర్నలిజాన్ని ఎలా ఆశించగలమని ప్రశ్నించారు. మీడియా సంస్థలు తమ యాజమాన్య ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, జర్నలిస్టులు వాస్తవాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు.
చదివే ప్రతి వార్త నిజం కాకపోవచ్చు: ఇందిరాణి సర్కార్
సీనియర్ జర్నలిస్ట్, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) జాతీయ కోఆర్డినేటర్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (IFJ) ప్రతినిధి ఇందిరాణి సర్కార్ స్వాగతోపన్యాసం చేస్తూ.. డిజిటల్ ప్రపంచంలో మనం చదివే ప్రతి సమాచారం నిజమైనది కాకపోవచ్చని అన్నారు. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మకుండా వాటి నిజానిజాలను పరిశీలించాలని సూచించారు
పరిస్థితులకు అనుగుణంగా మానవ మేధస్సును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కలిపి ఉపయోగించుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఏఐ సమాచారాన్ని సేకరించడంలో, విశ్లేషించడంలో సహాయపడినా, దాని విశ్వసనీయతను నిర్ణయించాల్సింది మానవ విచక్షణేనని అన్నారు. జర్నలిస్టులు సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ వాస్తవ నిర్ధారణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
========================