మారేడుమిల్లి మండలం.అర్జున్ సమాచారం:
గిరిజనుల భూములకు రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని మారేడుమిల్లిలో తుంగలో తొక్కుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు ఎలాంటి శాశ్వత కట్టడాలు కట్టకూడదన్న నిబంధన ఉన్నా, పర్యాటకం ముసుగులో రిసార్ట్స్ పేరుతో భారీ కాంక్రీట్ భవనాలు వెలిసిపోతున్నాయి.
1/70 చట్టం ఏం చెబుతోంది ?
ఏపీ షెడ్యూల్డ్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ ఫర్ రెగ్యులేషన్ 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీలో గిరిజన భూమిని గిరిజనేతరులకు అమ్మడం, బదలాయించడం, లీజుకు ఇవ్వడం పూర్తిగా నిషేధం. ఒకవేళ లీజు తీసుకున్నా వ్యవసాయానికి మాత్రమే తీసుకోవాలి, శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఇక్కడ ఆ చట్టానికి పూర్తి విరుద్ధంగా రెండు మూడు అంతస్తుల భవనాలు, స్విమ్మింగ్ పూల్స్, కాటేజీలు కట్టేస్తున్నారు.
అనుమతులు శూన్యం
ఏజెన్సీలో ఏదైనా కట్టడం కట్టాలంటే ముందుగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీ, అటవీ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. అసలు ఈ రిసార్ట్స్ కు పంచాయతీ లేఅవుట్ అప్రూవల్ గానీ, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ గానీ లేనే లేదని సమాచారం. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కట్టిన ఈ నిర్మాణాలన్నీ 1/70 చట్టం ప్రకారం చట్టవిరుద్ధమే.
బినామీల తెర వెనుక దందా
అధికారుల కళ్లుగప్పేందుకు గిరిజనుల పేరు మీద భూమి ఉన్నట్లు చూపి, వెనుక నుంచి గిరిజనేతరులు పెట్టుబడులు పెట్టి రిసార్ట్స్ కడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాగితాలపై లీజు వ్యవసాయానికే అని రాసుకుని, క్షేత్రంలో మాత్రం లక్షలు వసూలు చేసే రిసార్ట్స్ నడుపుతున్నారు. దీనివల్ల అసలు భూమి హక్కుదారులైన గిరిజనులకు నెలకు 5 వేలో, 10 వేలో ఇచ్చి మోసం చేస్తున్నారు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
అనుమతులు లేకుండా, 1/70 చట్టాన్ని ఉల్లంఘించి కట్టిన అక్రమ రిసార్ట్స్ ను వెంటనే సీజ్ చేసి కూల్చివేయాలని, భూములను తిరిగి గిరిజనులకు అప్పగించాలని పరువురు డిమాండ్ చేస్తున్నాయి.
============================