తిరుపతి ,అర్జున్ సమాచారం :
ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి పంచాయతీ వద్ద జూలై 2న నిర్వహించనున్న ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్’ (వీబీజీ రాంజీ) పథకం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి చిన్నపాటి లోపాలకు తావివ్వకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కుడా చైర్మన్ ఎం. రూపానంద రెడ్డిలతో కలిసి కలెక్టర్ బహిరంగ సభ, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరుకానున్నట్లు తెలిపారు. సుమారు 15 నుంచి 20 వేల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున సీటింగ్, పార్కింగ్, తాగునీరు, నిరంతర విద్యుత్, వైద్య శిబిరాలు, టాయిలెట్స్ వంటి అన్ని వసతులను రాబోయే రెండు రోజుల్లో పూర్తి చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ కులశేఖర్, తిరుపతి ఏఎస్పీ శ్రీనివాస్, ఆర్డీవో రామ్మోహన్, వివిధ శాఖల పీడీలు, ఎస్‌ఈలు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
=======================