భద్రాచలం, అర్జున్ సమాచారం:
భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో పోయిన మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పోలీసులు రికవరీ చేశారు. మొత్తం 32 మొబైల్ ఫోన్లను గుర్తించి, వాటిని సంబంధిత బాధితులు, యజమానులకు భద్రాచలం డీఎస్పీ యం. అరుణ్‌కుమార్ సమక్షంలో మంగళవారం అప్పగించారు.మొబైల్ ఫోన్లు పోయినట్లు బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు వాటి వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్ల ఆచూకీని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు తిరిగి అందజేయడంతో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా డీఎస్పీ యం. అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, బస్సులు, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ ఫోన్లు వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్లను నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ ఉంచరాదని, మొబైల్ ఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.అలాగే మొబైల్ ఫోన్‌కు సంబంధించిన ఐఎంఈఐ నంబర్, ఇతర వివరాలను పోలీసులకు అందిస్తే, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫోన్‌ను గుర్తించి రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుందని డీఎస్పీ తెలిపారు.
=================