ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 8:14 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రాజీవ్ నగర్ లంబాడి తండా భూ సమస్యలను పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్*

అధికారులతో కలిసి భూముల వివాదానికి సంబంధించిన వివరాల సేకరణ
కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
రామగుండం మండలం 8 ఇంక్లైన్ కాలనీలోని రాజీవ్ నగర్ లంబాడి తండాను భారత జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ బుధవారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఉన్నతాధికారులతో కలిసి తండాలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు, భూములకు సంబంధించిన వివాదాలపై వివరాలు సేకరించారు.

ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ, సింగరేణి 8 ఇంక్లైన్ కాలనీ పరిధిలో కొన్ని కేసులు కమిషన్ దృష్టికి వచ్చాయని, వాటికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆయా కేసులపై మరింత స్పష్టత కోసం నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించినట్లు పేర్కొన్నారు.

ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించామని, రాజీవ్ నగర్ లంబాడి తండాలో ప్రజలు సుమారు 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని  తెలిపారు. ప్రస్తుతం వారు నివాసం ఉంటున్న భూములకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో భూముల పరిస్థితి, ప్రజల సమస్యలు, సంబంధిత అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు చెప్పారు.

సింగరేణి సంస్థకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని, అవసరం లేకుండా వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. ఈ భూముల సమస్యకు సంబంధించి సింగరేణి సంస్థ సీఎండీకి లేఖ రాసి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు.

ఒక ప్రాంతంలో 12 సంవత్సరాలుగా నివాసం ఉంటే హక్కులు పొందే అంశానికి సంబంధించి చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని  పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి భూముల రికార్డులు, హక్కులు, ఇతర చట్టపరమైన అంశాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

రాజీవ్ నగర్ లంబాడి తండా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు  తెలిపారు.

ఈ పర్యటనలో  (అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్) అరుణ శ్రీ జిల్లా, రెవెన్యూ, సింగరేణి,జిల్లా అధికారులు ,తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు,పాల్గొన్నారు.
==========================