ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 6:20 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఘనంగా పోలీస్ మీ కోసం కార్యక్రమం: పోలీసు కమీషనర్ గౌష్ ఆలం

కరీంనగర్,అర్జున్ సమాచారం:
సైబర్ నేరాలు, డ్రగ్స్ రోడ్డు ప్రమాదాలపై అవగాహనా  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
శాంతిభద్రతల పరిరక్షణలో సీసీటీవీ కెమెరాల పాత్ర కీలకం.
కమిషనరేట్ పరిధిలో మరో 700 కెమెరాల ఏర్పాటు లక్ష్యం- సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వెలిచాల గ్రామం, రామడుగు మండలంలో బుధవారం “పోలీస్ మీ కోసం” అవగాహన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ  కెమెరాలను పోలీసు ఉన్నతాధికారులు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సదస్సుకు గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు దాదాపు 500 మందికి పైగా భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పోలీస్ కమీషనర్ శాంతిభద్రతల పరిరక్షణలో మరియు నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు.
వాటిలో ముఖ్యంశాలు:
సాంకేతికతతో నిఘా సీసీటీవీల ఏర్పాటు వెలిచాల గ్రామంలో పాత కెమెరాల స్థానంలో నలభై అధునాతన సాంకేతికతతో కూడిన కొత్త సీసీటీవీ కెమెరాలను అమర్చడం జరిగిందని తెలిపారు. ప్రతి గ్రామం, పట్టణం, మరియు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి మూల సీసీటీవీ నిఘా నీడలోకి తీసుకురావడమే పోలీసుల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ పరిధిలో లోపాలను అధిగమిస్తూ మరో 700 కొత్త కెమెరాలను అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.
సైబర్ నేరాలు గేమ్స్ పై అవగాహన: ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల సైబర్ పట్ల, వాటి వల్ల జరిగే నష్టాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ముఖ్యంగా చిన్న పిల్లలు, యువత ఆన్‌లైన్ గేమింగ్ బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడటం లేదా డబ్బులు నష్టపోవడం వంటి ఘటనలు కరీంనగర్ జిల్లాలో కూడా వెలుగు చూస్తున్నాయని, ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
మత్తు పదార్థాల నిర్మూలన: యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల అలవాట్లకు దూరంగా ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో వీటి సరఫరా లేదా వాడకంపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్,యాంటీ నార్కోటిక్ యూనిట్ ఇన్స్పెక్టర్ రఫీక్, రామడుగు ఎస్సై రాజు మరియు స్థానిక సర్పంచ్ వీర్ల నర్సింగ రావు
స్థానిక పోలీస్ సిబ్బంది, మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
==============================