ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 7:20 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రేసులో రాములమ్మ మంత్రి పదవిపై విజయశాంతి పేరు తెరపైకి

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
హైదరాబాద్ కొండా సురేఖపై చర్యల చర్చ ఖాళీ అయ్యే స్థానంపై అధిష్టానం కసరత్తు బీసీ మహిళా కోటాలో విజయశాంతికి అవకాశం.  మంత్రి కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలనకు చేరిన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవిపై కొత్త చర్చ మొదలైంది. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే, ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే దానిపై కాంగ్రెస్‌ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మహిళా ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీ సామాజికవర్గానికి చెందిన సీనియర్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
సురేఖ స్థానంలో బీసీ మహిళకు అవకాశం కల్పించే అంశాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా, విజయశాంతి తన అభ్యర్థిత్వాన్ని పార్టీ పెద్దల వద్ద వినిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
గతంలో తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారనే అంశాన్ని విజయశాంతి వర్గాలు గుర్తు చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ స్థాయిలో ఆమెకు అనుకూలంగా లాబీయింగ్‌ జరుగుతున్నట్లు ప్రచారం ఊపందుకోవడంతో, కొండా సురేఖ స్థానంలో రాములమ్మకు అవకాశం దక్కుతుందా? అనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
అయితే సురేఖపై తుది నిర్ణయం వెలువడిన తర్వాతే మంత్రి పదవి భర్తీపై అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయశాంతి పేరు ఆశావహుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది.
========================