కమలాపూర్,అర్జున్ సమాచారం:
మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ధాన్యంలో తరుగు పేరుతో అధికంగా కోతలు విధించకుండా, నిబంధనల ప్రకారం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను కోరారు. రైతులను కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులకు గురిచేయవద్దని స్పష్టం చేశారు.
హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంతో పాటు ఐదు మండలాలు, రెండు పట్టణాల్లో రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నీళ్లు లేక పదెకరాలు ఉన్న రైతులు ఐదెకరాలు, నాలుగెకరాలు మాత్రమే సాగు చేస్తున్నారు. ఐదెకరాలు ఉన్న రైతులు రెండు ఎకరాలు, ఎకరం మాత్రమే సాగు చేసుకునే దుస్థితి ఏర్పడింది. రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితి రావడం అత్యంత బాధాకరం.
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద 25 వేల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలుస్తున్నా కాళేశ్వరం నీటిని ఎందుకు ఎత్తడం లేదని ప్రశ్నిస్తున్నాం. ఈ లెక్కలు నా సొంతంగా చెబుతున్నవి కావు. కేంద్ర జల సంఘం (Central Water Commission) గణాంకాల ప్రకారం ఇప్పటికీ ఆన్లైన్లో 25 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కనిపిస్తోంది. ఆ నీటిని లిఫ్ట్ చేసి ఉంటే హుజురాబాద్ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందేదని అన్నారు.
గతంలో కేటీఆర్ తో కలిసి వేలాది మంది రైతులతో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించి లక్ష క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వెంటనే నీటిని లిఫ్ట్ చేసి రైతులకు అందించాలని కోరాం. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా నీటిని సముద్రం పాలు చేసింది.
గోదావరి నుంచి సుమారు 750 టీఎంసీలు, కృష్ణా నుంచి 250 టీఎంసీల నీటిని వినియోగించుకోకుండా సముద్రం పాలు చేసిన ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలు కనిపించడం లేదా?
కేసీఆర్ పాలనకు.. కాంగ్రెస్ పాలనకు తేడా రైతులకు స్పష్టంగా కనిపిస్తోంది.
కేసీఆర్ గారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజైనా రైతులకు సాగునీటి సమస్య వచ్చిందా? 24 గంటల ఉచిత విద్యుత్ అందకుండా పోయిందా? రైతుబంధు అందని సీజన్ ఉందా? దురదృష్టవశాత్తూ రైతు చనిపోతే ఆ కుటుంబానికి రైతుబీమా కింద రూ.5 లక్షలు అందకుండా పోయాయా? రైతులు ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచించాలి.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పుష్కలంగా నీళ్లు వచ్చాయి. 24 గంటల కరెంటు వచ్చింది. రైతుబంధు, రైతుబీమా అందాయి. మరి కేసీఆర్ గారు అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాతే నీళ్ల సమస్యలు, కరెంటు కోతలు, యూరియా, డీఏపీ కొరతలు ఎందుకు వస్తున్నాయి?
ఏ పంట పండించినా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ బోనస్ ఏమైంది? రైతులకు ఇచ్చిన హామీలన్నీ బోగస్ మాటలుగానే మిగిలిపోయాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ క్రాప్ హాలిడే ప్రకటించడం ఏంటి? రైతులు పంటలు పండించకుండా చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? కాళేశ్వరం ప్రాజెక్టుకు రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తే సామర్థ్యం ఉంది. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఈ క్షణం కూడా నీటిని లిఫ్ట్ చేసి రైతులకు అందిస్తే రైతులు మళ్లీ పంటలు వేసుకునే అవకాశం ఉంది.
దయచేసి రాజకీయాలు చేయకండి. రైతుల జీవితాలతో చెలగాటం ఆడకండి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సాగునీటిని అందించాలి.
హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, ఇల్లంతకుంట, జమ్మికుంట, వీణవంక, హుజురాబాద్ మండలాలతో పాటు హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల్లో రైతులకు వెంటనే సాగునీరు అందించాలి. క్రాప్ హాలిడే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ క్రాప్ హాలిడే ప్రకటిస్తే నష్టపోయే ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. రైతుల పక్షాన, రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు.