ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 1:46 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

లాభాలే ముఖ్యమా…

లాభాలే ముఖ్యమా…

విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 23.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పారిశ్రామిక సంస్థలను ఉద్దేశించి సంధించిన కొన్ని కీలక ప్రశ్నలు కేవలం చప్పట్లతో సరిపెట్టేవికావు. ఆయా సంస్థలు వాటిపై లోతుగా ఆలోచించాల్సిన బాధ్యతలు. గత కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. పరిశ్రమల పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. అయినప్పటికీ ఉద్యోగాల కల్పన ఆశించిన స్థాయిలో ఎందుకు లేదు? కార్పొరేట్ సంస్థల లాభాలు పెరుగుతున్నాయి. మరి ఉద్యోగుల జీతాలు అదే స్థాయిలో ఎందుకు పెరగడం లేదు? పరిశ్రమల లాభాలు దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి? భారత దేశంలోనే భారీ మార్కెట్ ఉన్నప్పటికీ భారతీయ కంపెనీలు ప్రపంచ మార్కెట్లలో మరింత బలంగా ఎందుకు పోటీ పడడం లేదు ? దేశీయ మార్కెట్‌పై మాత్రమే ఆధారపడకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తరించే సామర్థాన్ని పరిశ్రమలు ఎందుకు పెంచుకోవడం లేదు?ఈ ప్రశ్నలు ఇప్పుడు కార్పొరేట్ రంగంలో చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్ పన్నును 30% నుండి 22%కి తగ్గించడంతో పాటు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చినప్పటికీ, ఆ ప్రయోజనాలను కంపెనీలు ఉద్యోగుల జీతాల పెంపుకు, కొత్త ఉద్యోగాల కల్పనకు ఎందుకు ఉపయోగించడం లేదని ఆయన ప్రశ్నించారు.
నాణ్యత విషయంలో మార్పు. దేశీయ వినియోగదారులను తక్కువగా అంచనా వేయవద్దని, విదేశాలకు పంపే వస్తువులకే కాకుండా భారతీయులకు అందించే ఉత్పత్తులలోనూ అంతర్జాతీయ స్థాయి (‘ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ’) నాణ్యత ఉండాలని స్పష్టం చేశారు.
• ‘ఇండియా ఫస్ట్’ నినాదం. వచ్చే 20 ఏళ్ల పాటు ప్రతి దీర్ఘకాలిక పెట్టుబడి నిర్ణయంలోనూ ‘ఇండియా ఫస్ట్’  విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.
 దిగుమతుల తగ్గింపు, వ్యవసాయ పెట్టుబడులు. ఫార్మా ముడిసరుకులు, ప్రత్యేక స్టీల్, అల్యూమినియం వంటి రంగాల్లో దేశీయ తయారీని పెంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని సూచించారు. అలాగే వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో కార్పొరేట్ పెట్టుబడులు పెరగాలన్నారు.
 పేదరిక నిర్మూలనపై వ్యాఖ్యలు. గత 12-13 ఏళ్లలో సరైన విధానాల వల్ల సుమారు 50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుండి బయటపడ్డారని ప్రధాని పేర్కొన్నారు. బడ్జెట్‌కు ముందు మరోసారి కొత్త రాయితీలు, సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడమే కాదు, పారిశ్రామిక సంస్థలు ఎంతవరకు తమ బాధ్యలను నిర్వర్తిస్తున్నాయో నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రధాని ప్రశ్నల సారాంశం వెల్లడించింది. 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం భారతీయ కంపెనీల లాభాలు గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జిడిపిలో 4.8 శాతానికి చేరుకున్నాయి. లాభాల వృద్ధి 22.3 శాతం పెరిగింది. ఉపాధి వృద్ధి మాత్రం 1.5 శాతం మాత్రమే. ఉద్యోగుల వ్యయాల వృద్ధి 13 శాతం కాగా, నామమాత్రపు వేతన వృద్ధి 5 శాతం మాత్రమే. చాలా కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను, ఖర్చులను తగ్గించడం, ఉద్యోగులపై వ్యయాన్ని నియంత్రించడం, లాభాల మార్జిన్లు పెంచుకోవడం వంటి చర్యలు చేపడుతున్నాయి. కంపెనీల లాభాలు పెరుగుతుండడం స్వాగతించదగినదే. కానీ ఉద్యోగుల జీతాలు పెరగకుండా నిలిచిపోవడం, ఉద్యోగాల కల్పన మందగించడం జరిగితే ఆర్థిక వ్యవస్థలో వినియోగదారులనుంచి వచ్చే డిమాండ్ బలహీన పడుతుంది. కార్మికులు కూడా వినియోగదారులే అన్న సంగతి మరిచిపోరాదు.ఉద్యోగుల వేతనాలు పెరిగితే, ప్రజల కొనుగోలుశక్తి పెరుగుతుందని ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకూర్ అభిప్రాయం పడడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. వేతనాల పెరుగుదల అనేది కేవలం ఉద్యోగుల సంక్షేమం అంశం మాత్రమే కాదు. అది దేశీయ మార్కెట్‌ను బలోపేతం చేసే ఆర్థిక విధానం కూడా. పరిశ్రమల్లో కొత్త పెట్టుబడులను ప్రోత్సహించడానికి, పరిశ్రమల విస్తరణకు అవకాశం కల్పించడానికి, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి, తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం 2019లో కార్పొరేట్ పన్ను రేటును సాధారణ దేశీయ కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. అలాగే పన్ను విధానాల్లో సంస్కరణలు, జిఎస్‌టి మార్పులు, వినియోగదారులకు పన్ను ఉపశమనం వంటి చర్యలు చేపట్టింది. ప్రభుత్వం పన్ను తగ్గించిందని ప్రతీ కంపెనీ వెంటనే ఉద్యోగాలను పెంచాల్సిందేనని చెప్పలేం. ఎందుకంటే పెట్టుబడి నిర్ణయాలపై మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, వడ్డీరేట్లు, ముడిసరకు ధరలు కూడా ప్రభావం చూపుతాయి. అయితే రాయితీలు పొందుతున్న సంస్థలు తమ పెట్టుబడులు, ఉపాధి, ఉత్పాదకత ఫలితాలపై పారదర్శకమైన బాధ్యత వహించాల్సి ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు హక్కులుగా కాకుండా దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే అవకాశాలుగా పరిశ్రమలు సద్వినియోగం చేసుకోవాలి. దేశంలో భారీ స్వదేశీ మార్కెట్‌పై పరిశ్రమలు చూపిస్తున్న ధోరణిని కూడా మోడీ సమంజసంగా ప్రశ్నించారు. నాణ్యత లేని వస్తువులను కూడా తప్పనిసరిగా కొనుగోలు చేసేవారిగా స్వదేశీ వినియోగదారులను చూడకూడదని, విదేశాలకు ఎగుమతి చేసే వస్తువులకు మాత్రమే అత్యుత్తమ నాణ్యతను రూపొందించడం సరైన పద్ధతి కాదని నిలదీశారు. దేశీయ వినియోగదారులకు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన ఉత్పత్తులను అందించాలని పరిశ్రమలకు సూచించారు. అలాగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కేవలం సౌకర్యవంతమైన విజయంగా భావించకూడదని, ఆ ఒప్పందాల ద్వారా లభించే వ్యాపార అవకాశాలను మెరుగైన ఉత్పత్తుల రూపకల్పన, సాంకేతికత, మార్కెటింగ్, పంపిణీ వ్యవస్థల ద్వారా సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. కేవలం అత్యున్నత సాంకేతిక రంగాల్లో లభించే ఉద్యోగాలు మాత్రమే లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేవు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే తయారీ పరిశ్రమలు, ఆధునిక సేవా రంగాలు, అప్రెంటిస్‌షిప్ శిక్షణలు, వృత్తి విద్యల్లో శిక్షణలు, కంపెనీలకు విస్తృతంగా దోహదపడతాయి. భారత దేశం ప్రపంచం లోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటి. ఏటా లక్షలాది మంది యువత తమ చదువులు పూర్తి చేసుకుని మార్కెట్లోకి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వృద్ధ్దికి అనుగుణంగా నాణ్యమైన ఉద్యోగాలు ఏర్పడకపోతే ‘డెమోగ్రఫిక్ డివిడెండ్’ అనేది ‘డెమోగ్రఫిక్ ఛాలెంజ్’ గా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలు తమ లాభాలు, వ్యాపార అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించకుండా ఉద్యోగుల సంక్షేమం, న్యాయమైన వేతనాలు, ఉపాధి కల్పన, దేశ ఆర్థిక అభివృద్ధి తదితర అంశాలను తమ బాధ్యతలుగా ఆచరణలో నిరూపించుకోవాలి