ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 8:20 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

విద్యార్థులకు విజయ్‌ సర్కార్‌ భారీ కానుక.. ఏకంగా రూ.2,000 కోట్లు విద్యార్థుల ఉచిత ల్యాప్‌టాప్‌ల కోసం రూ.2,000 కోట్లు మంజూరు పథకానికి ‘వెట్రి ల్యాప్‌టాప్‌ స్కీమ్‌’గా పేరు డిగ్రీ, డిప్లొమా మొదటి, రెండో ఏడాది విద్యార్థులకు అవకాశం పలు ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులకూ వర్తింపు ల్యాప్‌టాప్‌లలో ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌ ఉండేలా నిర్ణయం

 అర్జున్ సమాచారం:
తమిళనాడు విద్యార్థులకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ శుభవార్త చెప్పారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించేందుకు రూ.2,000 కోట్లు మంజూరు చేశారు. ‘వెట్రి ల్యాప్‌టాప్‌ పథకం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకానికి ప్రభుత్వం తాజాగా పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో మొదటి, రెండో ఏడాది డిగ్రీ, డిప్లొమా చదువుతున్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించనున్నారు. ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఆర్ట్స్‌, సైన్స్‌, వైద్య, న్యాయ, వ్యవసాయ, పశువైద్య, మత్స్యశాస్త్ర కోర్సుల విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులు. గత విద్యా సంవత్సరంలో ల్యాప్‌టాప్‌లు అందుకోని ప్రొఫెషనల్‌ కోర్సుల మూడు, నాలుగో ఏడాది విద్యార్థులకూ అవకాశం కల్పించారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మంచి సామర్థ్యం ఉన్న ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌ లేదా దానికి సమానమైన సాంకేతికత ఉండనుంది. పథకం అమలును పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ల్యాప్‌టాప్‌ల కొనుగోలు బాధ్యతను ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ తమిళనాడు )కు అప్పగించారు. నాణ్యత, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా పరికరాలను కొనుగోలు చేయనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు డిజిటల్‌ విద్యను అందుబాటులోకి తీసుకురావడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఆన్‌లైన్‌ తరగతులు, సాంకేతిక నైపుణ్యాల అభ్యాసం, ఉద్యోగ అవకాశాలకు సిద్ధమయ్యేందుకు ఈ ల్యాప్‌టాప్‌లు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
==========================