ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 7:53 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

వైభవంగా శ్రీవారి రథోత్సవం భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు గోవిందనామస్మరణతో మారుమోగిన తిరుమాడ వీధులు

అర్జున్ సమాచారం:
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని రథాన్ని లాగి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. స్వామివారు రథంపై విహరిస్తుండగా భక్తులు అడుగడుగునా హారతులు సమర్పిస్తూ, “గోవిందా.. గోవిందా” అంటూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
గోవిందనామస్మరణతో తిరుమాడ వీధులు మారుమోగాయి.

ఆర్ష సంప్రదాయంలో రథోత్సవానికి విశిష్ట స్థానం

అనాదికాలం నుంచి రాజులకు రథసంచారం ప్రసిద్ధమైంది. యుద్ధాల్లోనూ రథాలను విరివిగా ఉపయోగించినట్లు భారతాది ఇతిహాసాలు, పురాణాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడని ఆర్ష గ్రంథాలు పేర్కొంటున్నాయి. ప్రసిద్ధ దేవాలయాల్లో ఉత్సవమూర్తులను రథంపై అధిష్ఠింపజేసి ఊరేగించే సంప్రదాయం ఆగమశాస్త్ర సమ్మతంగా కొనసాగుతోంది.

“రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే”

తిరుమల శ్రీవారి రథోత్సవం విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. “రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే” అనే ఆర్షవాక్యం రథంపై కొలువుదీరిన శ్రీకేశవుని దర్శనం పరమపవిత్రమైనదని తెలియజేస్తోంది.

భక్తులు రథానికి కట్టిన తాళ్లను పట్టుకుని స్వామివారి రథాన్ని ముందుకు లాగుతూ భక్తి పరవశ్యంలో మునిగిపోయారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రథోత్సవం సురక్షితంగా జరిగేలా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

రథోత్సవంలో అంతర్లీనమైన ఆత్మతత్త్వం

రథోత్సవానికి విశిష్టమైన తాత్త్విక సందేశం కూడా ఉంది. కఠోపనిషత్తులో ఆత్మను రథికుడిగా, శరీరాన్ని రథంగా, బుద్ధిని సారథిగా, మనస్సును పగ్గాలుగా, ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణించారు. ఇంద్రియాలకు విషయాలే మార్గాలుగా పేర్కొంటూ ఆత్మ–అనాత్మ వివేకాన్ని ఉపదేశించింది.

రథోత్సవం భక్తులకు ఈ ఆధ్యాత్మిక తత్త్వాన్ని గుర్తుచేస్తుంది. భక్తులు రథాన్ని లాగుతున్నప్పటికీ, సకల జీవుల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన భక్తులను అనుగ్రహిస్తూ తన రథాన్ని తానే నడిపిస్తున్నాడనే భావన ఈ ఉత్సవంలో అంతర్లీనంగా ఉంది