విజయవాడ సెప్టెంబర్ 22,అర్జున్ సమాచారం”:
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పేరు, అధికారిక గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపజేస్తూ తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల అధినేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే చేతుల నుంచి శివసేన ఏక్‌నాథ్ షిండే చేతికి, శరద్ పవార్ పట్టు నుంచి ఎన్సీపీ అజిత్ పవార్ చేతికి ఎలాగైతే ప్రజాప్రతినిధుల సంఖ్యాబలం ఆధారంగా వెళ్లిపోయాయో.. ఇప్పుడు బెంగాల్‌లోనూ మమతా బెనర్జీపై రెబల్స్ పైచేయి సాధించి పార్టీని చేజిక్కించుకునే దశకు చేరుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు, చట్టపరమైన పూర్వాపరాలను పరిశీలిస్తే.. శాసనసభాపక్షంలో సంఖ్యాబలం ఉన్న వర్గానికే అసలైన పార్టీగా గుర్తింపు దక్కుతోందన్నది కాదనలేని వాస్తవంగా మారింది. ఇదే సూత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ సరికొత్త చర్చకు ఆజ్యం పోస్తోంది.ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నిబంధనల ప్రకారం.. శాసనసభాపక్షంలో మూడింట రెండొంతుల మంది ప్రజాప్రతినిధులు ఒకే తాటిపైకి వస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎలాంటి అనర్హత వేటు పడదు. అంటే, మొత్తం 11 మందిలో జగన్‌ను మినహాయించి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు గానీ, కనీసం 8 మంది సభ్యులు గానీ ఒకే మాటపై నిలబడి తిరుగుబాటు బావుటా ఎగరేస్తే చట్టపరంగా వారి సభ్యత్వాలకు ఎలాంటి ఢోకా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వ్యూహకర్త నాయకత్వం వహిస్తే, శాసనసభాపక్షంలో సంపూర్ణ ఆధిక్యతతో అసలైన వైఎస్సార్‌సీపీ తమదేనంటూ స్పీకర్, ఎన్నికల సంఘం ముందు వాదనలు వినిపించే సాంకేతిక వెసులుబాటు స్పష్టంగా కనిపిస్తోంది.ఒకవేళ జగన్ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం బయటకు వస్తే.. పార్టీకి భావోద్వేగ పునాదులైన వైఎస్సార్ కుటుంబ సభ్యులను రంగంలోకి దించడం మరో కీలక వ్యూహం కాగలదు. జగన్ వ్యవహారశైలితో ఇప్పటికే పార్టీకి దూరమైన తల్లి వైఎస్ విజయమ్మ , రాజకీయంగా పోరాడుతున్న వైఎస్ షర్మిలను గౌరవ అధ్యక్షురాలిగానో, అధినేత్రిగానో తెరపైకి తెస్తే.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, సంప్రదాయ ఓటుబ్యాంకును తమవైపు తిప్పుకోవడం అసమ్మతి వర్గానికి మరింత సులువవుతుంది. వైఎస్సార్ ఆశయాలు, అభిమానుల ప్రాతిపదికనే ఏర్పడిన పార్టీ కావడంతో.. కుటుంబంలో జగన్ మాత్రమే కాకుండా మిగిలిన వారికీ ఆ వారసత్వ హక్కు సహజంగానే దక్కుతుంది. ఇది పార్టీ క్యాడర్‌లో చీలికను సహజమైనదిగా మార్చేందుకు తిరుగులేని అస్త్రంగా మారుతుంది.ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న ఒంటెద్దు పోకడలు, క్షేత్రస్థాయికి దూరమైన వింత రాజకీయం పార్టీ నాయకులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. గతంలో అధికారాన్ని అనుభవించిన నేతలు నేడు కేసులు, వ్యాపార నష్టాలు, రాజకీయ భవిష్యత్తు లేని శూన్యతతో కొట్టుమిట్టాడుతున్నారు. భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో కార్యాచరణ లేని అధినేతను నమ్ముకుని ఉంటే తమ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని పలువురు ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జగన్ నీడ నుంచి బయటపడి, సొంతంగా పార్టీపై పట్టు సాధించడమో లేదా బలమైన ఫ్రంట్‌గా మారి కేంద్ర, రాష్ట్ర అధికార వర్గాలతో సంప్రదింపులు జరపడమో మాత్రమే వారి ఆస్తులను, రాజకీయ జీవితాలను కాపాడుకునే ఏకైక మార్గంగా కనిపిస్తోంది.అయితే ఈ ఫార్ములా అమలు కావడానికి ప్రధాన అవరోధం ఎమ్మెల్యేలకు ఉన్న రాజకీయ ధైర్యం. జగన్ ఆర్థిక, సామాజిక బలాల ముందు ఎదురునిలిచి బరిలోకి దిగడానికి ఎమ్మెల్యేలు ఇప్పటికీ సంశయిస్తున్నారు. కానీ, రాయలసీమలో తనకంటూ సొంత బలం, విస్తృత ఆర్థిక నెట్‌వర్క్ ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్ నేత గనుక తెగించి అడుగు ముందుకు వేస్తే పరిస్థితులు శరవేగంగా తలకిందులవుతాయి. మహారాష్ట్ర, బెంగాల్ ఉదంతాలు నిరూపిస్తున్నట్లుగా.. తిరుగుబాటు చేసి సంఖ్యాబలాన్ని నిరూపించుకుంటే ఎవరి చేతికైనా పార్టీ చిక్కుతుందనే భయం జగన్‌ను వెంటాడక తప్పదు. పెద్దిరెడ్డి ఆలోచన మారితే.. వైఎస్సార్‌సీపీలో పెను భూకంపం ఖాయమని అనుకోవచ్చు.
=====================