శబరిమల,అర్జున్ సమాచారం:
మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ (2026-27) సందర్భంగా పవిత్ర పంబ నదిలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు కేరళ యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. నదిలో వాడిన వస్త్రాలు,
ప్లాస్టిక్ లేదా ఇతర చెత్త వేసే భక్తులకు అక్కడికక్కడే రూ. 5,000 వరకు జరిమానా విధించనున్నట్లు శబరిమల అదనపు జిల్లా మేజిస్ట్రేట్ దిలీప్ కె.కైనిక్కర స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన నవంబర్ 22న
నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, పంబ నది, దాని ఉపనదులు, స్నాన ఘట్టాల వద్ద వాడిన బట్టలు, ఇతర వ్యక్తిగత వస్తువులు వదిలివెళ్లడం పూర్తిగా నిషిద్ధం. నదీ తీరాల్లో, బహిరంగ
ప్రదేశాల్లో ప్లాస్టిక్, ఇతర ఘన వ్యర్థాలను పారవేయరాదని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయని, ముందుగా ఉపసంహరించుకోకపోతే రెండు నెలల పాటు
కొనసాగుతాయని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, కేరళ పంచాయతీ రాజ్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద జరిమానా విధిస్తారు. పంబ డ్యూటీ మేజిస్ట్రేట్,
పంబ పోలీస్ స్పెషల్ ఆఫీసర్, రన్ని-పెరునాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి తనిఖీలు చేసి, జరిమానాలు వసూలు చేసే అధికారాన్ని కల్పించారు. ఒకవేళ జరిమానా విధించిన 15 రోజుల్లోగా చెల్లించకపోతే,
వారిపై భారతీయ న్యాయ సంహిత , నీటి కాలుష్య నివారణ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, ప్రాసిక్యూషన్ చర్యలు చేపడతామని అధికారులు హెచ్చరించారు. లక్షలాది మంది భక్తులు,
స్థానికులకు పంబ నదే ప్రధాన తాగునీటి వనరు అని, నదిలో వస్త్రాలు వదలడం వల్ల నీరు కలుషితమై అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అధికారులు ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని
వివరించారు. భక్తులకు అవగాహన కల్పించేందుకు ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు సహకారంతో తెలుగు సహా వివిధ భాషల్లో బోర్డులు, మైక్ ప్రకటనల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. జరిమానాల ద్వారా
వసూలైన మొత్తాన్ని పంబ, శబరిమల ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు, నది శుభ్రతకు వినియోగించనున్నారు.
=====================