న్యూఢిల్లీ, అక్టోబరు 6, అర్జున్ సమాచారం:
దసరా, దీపావళి పండుగల వేళ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ కింద అర్హులైన ప్రతి కార్మికుడికి రూ. 1,10,250 చొప్పున బోనస్ ప్రకటించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. గతేడాది చెల్లించిన రూ. 1,03,000 బోనస్‌తో పోలిస్తే ఈసారి మరింత పెరగడం విశేషం.దేశానికి వెలుగులు పంచేందుకు పగలు, రాత్రి భూగర్భంలో కష్టపడుతున్న సింగరేణి కార్మికుల కృషి వెలకట్టలేనిదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి కేవలం ఒక బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమని, లక్షలాది కుటుంబాలకు జీవనాధారమని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో, రాష్ట్ర ప్రగతిలో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన రూ. 60,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచేందుకు యాజమాన్యం, కార్మికులు కలిసి ప్రణాళికలు అమలు చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులకు, ఉద్యోగులు వారి కుటుంబసభ్యులకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నుంచి వెలువడిన బోనస్ ప్రకటనతో సింగరేణి బొగ్గు గనుల పరిధిలో కార్మికుల్లో పండుగ వాతావరణం నెలకొంది.
==================