సింగరేణి పెన్షన్‌దారులకు రూ.30 లక్షల ప్రమాద బీమా అమలు చేయాలి
నల్ల బ్యాడ్జీలతో ధర్నా
తాండూర్: అర్జున్ సమాచారం ప్రతినిధి, జూలై 27.
సింగరేణి కోల్ మైన్స్‌లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పెన్షన్‌దారులకు ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, యూనియన్ బ్యాంక్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రూ.30 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల సహజ మరణ బీమా సౌకర్యాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల జిల్లా తాండూర్ ఐబీలోని యూనియన్ బ్యాంక్ శాఖ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ నిశాంత్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, యూనియన్ బ్యాంక్ మధ్య 2024 ఫిబ్రవరి 26న కుదిరిన ఒప్పందం ప్రకారం 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగి యూనియన్ బ్యాంక్‌లో ఖాతాలు ఉన్న సింగరేణి విశ్రాంత కోల్ మైన్స్ పెన్షన్‌దారులకు రూ.30 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల సహజ మరణ బీమా వర్తింపజేయాల్సి ఉందన్నారు. అయితే ఒప్పందం అమలులోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా బ్యాంక్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఒక్కరికీ కూడా బీమా సౌకర్యం కల్పించకపోవడం అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు.సింగరేణి సంస్థకు దశాబ్దాల పాటు సేవలందించి రిటైర్ అయిన కార్మికులు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కోసం ఈ బీమా సౌకర్యాలపై ఆధారపడుతున్నారని, అలాంటి సమయంలో ఒప్పందాన్ని అమలు చేయకపోవడం వేలాది కుటుంబాల ప్రయోజనాలను దెబ్బతీసే చర్య అని అన్నారు. విశ్రాంత ఉద్యోగుల పట్ల యూనియన్ బ్యాంక్ యాజమాన్యం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని వెంటనే మార్చుకొని ఒప్పందంలోని అన్ని నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.రాబోయే పది రోజులలోపు అర్హులైన ఖాతాదారులందరికీ బీమా సౌకర్యాలను అమలు చేయాలని, లేనిపక్షంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖల ఎదుట విశ్రాంత సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి భారీ ఎత్తున శాంతియుత ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే జిల్లా కలెక్టర్, సింగరేణి యాజమాన్యం, బ్యాంక్ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అసం రాజయ్య, తగరం రాజన్న, తోటపల్లి ఎల్లయ్య, దేవరకొండ మౌగిలి, కె. దుర్గాస్వామి, కె. లక్ష్మి, ఎర్రయ్య, సి. రాయలింగు, ఎడ్ల గొంతయ్య తదితరులతో పాటు మాదారం, తాండూర్, తంగళ్లపల్లి, కొత్తపల్లి, కొత్తగుడిసెలు తదితర ప్రాంతాలకు చెందిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్నవారంతా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. యూనియన్ బ్యాంక్ యాజమాన్యం వెంటనే స్పందించి ఒప్పందాన్ని అమలు చేయాలని వారు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.