ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 7:20 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ కష్టాలు

కరీంనగర్,అర్జున్ సమాచారం:
పొద్దంతా బొగ్గు గనుల్లో కష్టపడి.. చెమటోడ్చి.. సింగరేణి సంస్థ అభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేసిన కార్మికులు.. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత తమ కనీస అవసరాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. వృద్ధాప్యంలో కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన నెలవారీ పెన్షన్.. వారి పాలిట పెను సమస్యగా మారుతోంది. ప్రతి నెల ఒకటో తేదీన ఖాతాల్లో జమ కావాల్సిన పెన్షన్.. గురువారం వరకు కూడా పలువురు రిటైర్డ్ కార్మికులకు అందకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా దీపావళి పండుగ వేళ.. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాల్సిన సమయంలో పెన్షన్ అందకపోవడం వారి బాధను మరింత పెంచుతోంది. ఇంటి ఖర్చులు.. మందులు.. నిత్యావసరాలు.. ఇలా ప్రతి అవసరానికి పెన్షన్‌పైనే ఆధారపడే వృద్ధ కార్మికులు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.సీఎంపీఎఫ్ కార్యాలయాల్లో వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. పెన్షన్ చెల్లింపుల్లో తరచూ జాప్యం ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆలస్యానికి కారణాలు వెల్లడించకపోవడం.. అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం లేకపోవడం రిటైర్డ్ కార్మికుల్లో మరింత అసంతృప్తిని పెంచుతోంది.కార్మికుల సంక్షేమమే లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వాలు.. పెన్షన్ సమస్యపై ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తమ సమస్యలను పరిష్కరించడంలో కార్మిక సంఘాలు కూడా తగిన చొరవ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.పెన్షన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ.. అధికారుల కార్యాలయాల వద్ద ఎదురుచూస్తూ.. తమ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్న రిటైర్డ్ సింగరేణి ఉద్యోగులు తమ ఆవేదనను ప్రజా క్రాంతి దృష్టికి తీసుకొచ్చారు.