ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 7:11 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రాజ్యాంగ విలువలు,న్యాయపాలన పరిరక్షణలో జస్టిస్ రఘునందన్ రావు సేవలు చిరస్మరణీయం* *రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్*

అమరావతి, జూన్ 30,అర్జున్ సమాచారం :
రాజ్యాంగ విలువలు, న్యాయపాలన పరిరక్షణలో జస్టిస్ రఘునందన్ రావు  సేవలు చిరస్మరణీయం అని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ అభినందించారు.హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ రఘునందన్ రావు  పదవీ విరమణ సందర్బంగా సోమవారం  హైకోర్టు మొదటి కోర్టు హాల్లో  ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది.ఈ వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ జస్టిస్ రఘునందన్ రావు న్యాయ ప్రస్థానం, న్యాయపరమైన నిష్పాక్షికత, రాజ్యాంగ విలువల పట్ల అచంచల నిబద్ధత, న్యాయవ్యవస్థ ఆధునీకరణలో ఆయన చేసిన విశిష్ట కృషిని కొనియాడారు.న్యాయవాదిగా విశేష అనుభవాన్ని సంపాదించిన తదుపరి న్యాయమూర్తిగా ధర్మాసనాన్ని అలంకరించి రాజ్యాంగ స్ఫూర్తిని, న్యాయపాలనను అత్యున్నత ప్రమాణాలతో పరిరక్షించారని ఆమె పేర్కొన్నారు.రాజ్యాంగపరమైన అంశాలు, సంక్లిష్టమైన సివిల్ వివాదాలు, పన్నుల సంబంధిత కేసులు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వంటి అనేక కీలక అంశాల్లో ఆయన వెలువరించిన తీర్పులు న్యాయవ్యవస్థకు మార్గదర్శకంగా నిలుస్తాయని జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు.
తన పదవీకాలంలో సుమారు 25 వేల కేసులను వేగవంతంగా, సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా జస్టిస్ రఘునందన్ రావు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశారని ఆమె పేర్కొన్నారు.న్యాయపరమైన బాధ్యతలతో పాటు పరిపాలనా వ్యవహారాల్లోనూ ఆయన అసాధారణ నాయకత్వాన్ని ప్రదర్శించారని, న్యాయస్థానాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, సమాచార సాంకేతికత వినియోగం, న్యాయ ప్రక్రియల డిజిటలైజేషన్, న్యాయసేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్మర ణీయమని కొనియాడారు.పరిపాలనా కమిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కమిటీ, నియామకాలు, బదిలీలు, న్యాయస్థానాల కంప్యూటరీకరణ,ఆర్థిక వ్యవహారాలు, హైకోర్టు పరిపాలన తదితర కీలక కమిటీలలో ఆయన పోషించిన పాత్ర ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ అభివృద్ధికి బలమైన పునాదులు వేసిందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఈ  సందర్బంగా అడిషినల్ సోలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్,అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభునాథ్ వాసిరెడ్డి,ఏపీ బార్ కౌన్సిల్  ఛైర్మన్ ధ్వారకానాథ్ రెడ్డి తదితరులు జస్టిస్ రఘునందనరావుకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ తమ అనుభవాలను పంచుకున్నారు.
ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు,బార్ కౌన్సిల్ ప్రతినిధులు, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు,న్యాయశాఖ అధికారులు,న్యాయవాదులు పాల్గొన్నారు.