ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 6:54 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

బడ్వేల్ నగరవనం ఘనంగా ప్రారంభం – ప్రజలకు ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన విహార కేంద్రం

బద్వేలు,అర్జున్ సమాచారం :

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం  బద్వేలు పట్టణ ప్రజలకు ప్రకృతి సోయగాలను చేరువ చేస్తూ అభివృద్ధి చేసిన బద్వేలు నగరవనం ఘనంగా ప్రారంభించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీవో  చంద్రమోహన్ , డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి , వైఎస్సార్ జిల్లా అటవీ అధికారి  రాజశేఖర్ బాబు  హాజరై నగరవనాన్ని ప్రజలకు అంకితం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు నగరవనాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ నగరవనాన్ని సందర్శించి ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు మొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు.

బడ్వేల్ నగరవనంలో ప్రత్యేక ఆకర్షణలు:

* సందర్శకుల కోసం ఆధునిక క్యాంటీన్
* స్వచ్ఛమైన తాగునీటి కోసం ఆర్.ఓ. వాటర్ సౌకర్యం
* ఔషధ మొక్కలతో అభివృద్ధి చేసిన ఋషివనం
* జ్యోతిష్య ప్రాధాన్యతతో రూపొందించిన నక్షత్రవనం
* చిన్నారుల కోసం ఆకర్షణీయమైన చిల్డ్రన్స్ ప్లే జోన్
* విశాలమైన పచ్చిక బయళ్లు (లాన్స్)
* వివిధ వన్యప్రాణుల ప్రతిరూపాలతో వైల్డ్‌లైఫ్ పార్క్
* సందర్శకులు విశ్రాంతి తీసుకునేందుకు అందమైన పగోడాలు
* ప్రకృతి మధ్య నడకను ఆస్వాదించే ట్రెక్కింగ్ ట్రాక్
* వివిధ రకాల మొక్కలతో కూడిన నర్సరీ
* ప్రకృతి వైవిధ్యాన్ని ప్రతిబింబించే అనేక రకాల వనాలు

ఈ నగరవనం కుటుంబ సమేతంగా సందర్శించడానికి, విద్యార్థులకు ప్రకృతి గురించి అవగాహన పెంపొందించడానికి, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించడానికి ఒక ఉత్తమ కేంద్రంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

జిల్లా అటవీ అధికారి శ్రీ రాజశేఖర్ బాబు  సూచనలు, మార్గదర్శకత్వంలో బడ్వేల్ నగరవనం అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయబడింది. ప్రజలందరూ ఈ వనాన్ని సందర్శించి పరిశుభ్రతను పాటిస్తూ, మొక్కలను సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది.

ఈ నగరవనం రూపుదిద్దుకోవడంలో మాజీ జిల్లా అటవీ అధికారి వినీత్ కుమార్,  దూరదృష్టి, ప్రణాళికాబద్ధమైన మార్గదర్శకత్వం, నిరంతర పర్యవేక్షణ, కృషి, అంకితభావం  క్షేత్రస్థాయి కృషి విశేషంగా నిలిచాయని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. వీరి కృషి ఫలితంగానే బడ్వేల్ నగరవనం నేడు ప్రజలకు అందుబాటులోకి వచ్చి బడ్వేల్ పట్టణానికి ఒక ప్రత్యేక పర్యాటక, పర్యావరణ ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నారు.
=======================